వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆప్తుడిగా, ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించారు. ఆయన శనివారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కు తన రాజీనామా పత్రం సమర్పించారు. ఈ నిర్ణయం వైసీపీకి పెద్ద షాక్ గా మారింది.
రాజీనామా అనంతరం, విజయసాయిరెడ్డి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. “ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం, డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం చేయలేదు” అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ రెండుసార్లు రాజ్యసభకు పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
రాజీనామా ముందు, వైసీపీ ఎంపీ గురుమూర్తి విజయసాయి ఇంటికి వెళ్లి మాట్లాడినా, ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి కారణంగానే రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, విజయసాయి దానిని ఖండించారు. అయితే ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు దారితీసింది.
రాజీనామా వెనుక కారణాలు
విజయసాయి తన భవిష్యత్తును రాజకీయాల నుంచి దూరంగా పెడుతూ వ్యవసాయానికి కేటాయించనున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం పై వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్‌లు తగులుతుండటంతో ఈ రాజీనామా మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా విజయసాయిరెడ్డి రాజీనామాను పరిగణిస్తున్నారు. మరోవైపు, బీజేపీతో వైసీపీ అధినేత జగన్ ఉన్న సంబంధాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ స్పందన
ప్రస్తుతం లండన్‌లో ఉన్న వైఎస్ జగన్, ఈ పరిణామాలను దగ్గరగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. బీజేపీతో వైసీపీ ఎంపీల భవిష్యత్‌పై చర్చలు జరుగుతున్నాయని, ఇది పార్టీపై మరింత ప్రభావం చూపనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.