సినీ నటుడు మోహన్ బాబు అరెస్ట్‌కి రంగం సిద్ధం అయినట్లే కనిపిస్తోంది పరిస్థితి. హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో.. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తున్న సూచనలు కనిపించడంతో.. మోహన్ బాబుకు మరో ప్రమాదం పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్నాళ్లుగా సీనియర్ నటుడు మోహన్ బాబుకు మనశ్శాంతి కరువయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.చిన్న కొడుకు మనోజ్‌తో గొడవలు రచ్చకెక్కడంతో.. గుట్టుగా ఉండి పరిష్కరించుకోవాల్సిన వారంతా ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ముందుగా తండ్రి తనపై దాడి చేశాడని మీడియా ఎదుట ఆరోపణలు చేశాడు మంచు మనోజ్. మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ.. రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లి ఫామ్‌హౌస్ వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది.
జల్‌పల్లి ఫామ్‌హౌస్ లో మోహన్ బాబు ఓ మీడియా ఛానల్ ప్రతినిధిపై దాడికి పాల్పడం వరకూ వెళ్లింది. రిపోర్టర్ చేతిలోని మైక్ లాక్కుని అతని తలపై బలంగా కొట్టడంతో..పై దవడ పై ఉండే ఒక ఎముక డ్యామేజ్ అయ్యింది. దీంతో దాడిలో గాయపడిన రిపోర్టర్ ని ఆసుపత్రిలో చేర్చి సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. అయితే అది కావాలని చేసిన దాడి కాదని. ఆ చీకట్లో మీడియా వాళ్లెవరో, ప్రత్యర్ధులు ఎవరో అర్ధం కాని పరిస్థితి ఉండటంతో అలా జరిగిపోయిందని మోహన్ బాబు వివరణ ఇచ్చారు.
తర్వాత స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రిపోర్టర్ ని పరామర్శించాడు. అయితే పోలీసులు ఈ ఘటనపై మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వద్ద ఉన్న రెండు గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనపై పెట్టిన కేసులో మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా ఆపాలంటూ మోహన్ బాబు లాయర్లు వేసిన పిటిషన్ ని తోసిపుచ్చిన న్యాయస్థానం..ఆయన అరెస్ట్ ని ఆపలేమని తెలియజేసింది.
దీంతో మోహన్ బాబు అరెస్ట్ ఖాయం అంటూ జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు రాచకొండ పోలీసులు ఇప్పటికే మోహన్ బాబు అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ మర్డర్ అటెంప్ట్ కేసులో కనుక ఆయన అరెస్ట్ అయితే… మోహన్ బాబు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. సుదీర్ఘ సినిమా ప్రస్థానం కలిగిన సీనియర్ నటుడుగా, రాజకీయ నేతగా ఇది మోహన్ బాబుకు కోలుకోలేని దెబ్బ అవుతుందనే చెప్పొచ్చు.