మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మట్కా’ ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల అయిన ఈ ట్రైలర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1958 నుంచి 1982 వరకు సాగే పీరియాడిక్ కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. మనం ఆశని అమ్ముతాం.. నమ్మకాన్ని కొంటాం.. అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
విశాఖ నేపథ్యంలో ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నారు. ఓ సామాన్య యువకుడు ‘మట్కా’ సామ్రాజ్యానికి అధినేతగా ఎలా ఎదిగాడు? డబ్బు కోసం ఏం చేశాడు? అనేది క్లుప్తంగా కథ. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ద్వారా కొంత కథ చెప్పారు. కానీ, ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే… కథ కంటే వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ ఆకట్టుకుంటోంది. గెటప్స్ పరంగా వేరియేషన్ చూపించడం గానీ, నటనలో ఇంటెన్స్ గానీ సూపర్ అని చెప్పాలి.
సర్కస్‌లో జోకర్‌ను చూసి జనం అంతా నవ్వుతారు చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని అదే సర్కస్‌లో పులులను, సింహాలను ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు రింగ్ మాస్టర్”. అంటూ మాస్ ఎలివేషన్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక ట్రైలర్ చూస్తే.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తుండగా.. వరుణ్‌తేజ్ ‘వాసు’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. నోరా ఫతేహి కీలక పాత్ర చేశారు. ఇంకా ఇందులో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.