దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కాగా కేరళ రాష్ట్రంలో తాజాగా జికా వైరస్ కేసులు వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే జికా వైరస్ కేసుల సంఖ్య 14 కు చేరుకుంది. ముందుగా తిరువనంతపురంలో 24 ఏళ్ల వయసున్న గర్భిణికి జికా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. అనంతరం మరో 19 శాంపిల్స్ ను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)కు పంపించగా, అందులో 13 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ఈ వైరస్ నివారణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.
ఎడిస్ జాతికి చెందిన దోమ కాటు కారణంగా వచ్చే జికా వైరస్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకరమైన వైరస్ లలో ఒకటిగా గుర్తించింది. ఈ దోమలు పగటిపూట సంచరిస్తాయి. అలాగే అదే జాతికి చెందిన దోమ డెంగ్యూ, చికున్‌గున్యా మరియు ఎల్లో ఫీవర్ వంటి ఇతర వ్యాధులను కూడా వ్యాపింపజేస్తుంది. ఈ వ్యాధి లైంగిక చర్యల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ గర్భిణీ స్త్రీలకు సోకితే, పుట్టబోయే పిల్లలకు కూడా చేరే అవకాశముంది. పిల్లలు మైక్రోసెఫాలీ మరియు ఇతర పుట్టుకతో వచ్చే వైకల్యాలతో జన్మించే అవకాశముంది. ఈ వైరస్ మొదటగా 1947లో ఉగాండాలోని జికా అడవుల్లోని రీసస్ కోతిలో గుర్తించారు. ఇప్పటికే ఈ వైరస్ భారత్ సహా 50కి పైగా దేశాలలో నివేదించబడింది. మరోవైపు దేశంలో జికా వైరస్ ను మొదటిసారిగా 2017 జనవరిలో అహ్మదాబాద్ లో, రెండవసారి 2017 జూలైలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో గుర్తించారు. కేరళలో జికా వైరస్ నమోదవడం ఇదే మొదటిసారి.
జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ఈ లక్షణాలు 2-7 రోజులు ఉంటాయి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జికా వైరస్ సోకినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ప్రస్తుతం జికా వైరస్ కు సరైన మందులు లేదా నిర్దిష్టమైన చికిత్స లేదు. బాధితుల లక్షణాల ఆధారంగా వైద్యం అందిస్తారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగడం చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ వైరస్ సంక్రమణను నివారించవచ్చు. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు, పెద్దలు మరియు పిల్లలు ఈ వైరస్ కు గురయ్యే అవకాశం ఉండడంతో వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ