వృద్ధాప్య సమస్య ఎక్కువగా ఉండటం జపాన్‌లో ఆందోళన కలిగిస్తోంది. జపాన్‌లో 2024 జనవరి నుంచి జూన్ వరకూ దాదాపు 40,000 మంది వృద్ధులు తమ ఇళ్లలో ఒంటరిగానే మరణించినట్లు అధికారిక లెక్కల్లో తేలింది. జాతీయ పోలీసు ఏజెన్సీ చెబుతున్నదాని ప్రకారం, చనిపోయినవారిలో కొన్నివేల మందిని ఒక నెల తర్వాత, వందకు పైగా మృతదేహాలను ఒక ఏడాది తర్వాత కనుగొనడం ఇప్పుడు షాకింగ్‌గా మారింది.
ఐక్యరాజ్యసమితి చెబుతన్నదాని ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వృద్ధులు ఇప్పుడు జపాన్‌లో ఉన్నారు. ఈ ఏజెన్సీ నివేదికతో, జపాన్‌లో పెరుగుతున్న వృద్ధుల సమస్య, అందులోనూ ఒంటరిగా నివసించేవారి సమస్యలు వెలుగులోకి వస్తున్నట్లు పేర్కొంది. 2024 తొలి అర్ధభాగానికి సంబంధించిన జాతీయ పోలీసు ఏజెన్సీ డేటా ప్రకారం.. ఒంటరిగా ఇంట్లో చనిపోయిన మొత్తం 37వేల227 మందిలో 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు 70% కన్నా ఎక్కువ మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇంట్లో ఒంటరిగా చనిపోయినవారిలో 40% మందిని ఒక రోజులోనే గుర్తించినా, దాదాపు 3,939 మృతదేహాలను మాత్రం నెల తర్వాత గుర్తించారు. అంతేకాదు 130 మృతదేహాలను ఒక ఏడాది తర్వాత గుర్తించినట్లు పోలీసు నివేదిక పేర్కొంది. ఇంట్లో ఒంటరిగా మరణించినవారిలో 7,498 మంది ఉండగా 85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు. 75 నుంచి 79 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారు 5,920 మంది, 70 నుంచి 74 సంవత్సరాల వయసు మధ్యనున్నవారు 5,635 మంది ఉన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, జపాన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసర్చ్, 2050 నాటికి 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల సంఖ్య 1.08 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అదే సమయానికి, ఒక్కరుగా జీవించేవారి సంఖ్య 2.33 కోట్లకు చేరుతుందని తెలిపింది.