మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పూణే, నాగ్‌పూర్, థానే, ముంబయి వంటి నగరాలలోనే కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ లో కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 15 నుంచి 21 వరకు ఏడురోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తునట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా మార్చి 15, సోమవారం ఉదయం తెల్లవారుజామునుంచే నాగ్‌పూర్ లో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. నాగ్‌పూర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. నాగ్‌పూర్ నగరం అంతటా పోలీసు సిబ్బంది మోహరించారు. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, అనవసరంగా ప్రజలు రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
లాక్‌డౌన్ సందర్భంగా కూరగాయలు, పండ్ల దుకాణాలు మరియు పాల బూత్ లు, మెడికల్ షాపులతో పాటుగా ఇతర అత్యవసర సేవలు అనుమతించబడతాయని పేర్కొన్నారు. నాగ్‌పూర్ ప్రాంతంలోని మాల్స్ మూసివేయబడతాయని, బహిరంగ కార్యక్రమాలు, వివాహాలు అనుమతించబడవని చెప్పారు. ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయనుండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాలకు అనుగుణంగా కొంత శాతం ఉద్యోగులను అనుమతించనున్నారు. రెస్టారెంట్లు రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని, హోమ్ డెలివరీ సర్వీసు మాత్రం రాత్రి 10 గంటల వరకు కొనసాగించుకోవచ్చని చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 23,14,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21,34,072 మంది కరోనా నుంచి కోలుకోగా, 52,861 మంది మరణించారు. ప్రస్తుతం 1,26,231 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ