జార్ఖండ్ అసెంబ్లీకి ఏప్రిల్ 13,20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లుండటంతో.. ఆధిక్యం కోసం ఇండియా కూటమితో ఎన్డీయే కూటమి హోరాహోరీ తలపడుతోంది. జార్ఖండ్ చిన్న రాష్ట్రం కావడంతో పాటు..కుల సమీకరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రతీ అసెంబ్లీ సీటు గెల్చుకోవడం ప్రధాన పక్షాలకు చాలా కీలకంగా మారిందనే చెప్పొచ్చు. అందుకే జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఇక్కడ గెలుపు కోసం చెమటోడుస్తున్నాయి.
ఓ వైపు ఎన్నికల వేడి రాజుకుంటూ ఉండగానే.. మరోవైపు రాష్ట్రంలో రెండు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారంటూ రకరకాల సర్వేలు బయటకు వస్తున్నాయి. వీటిలో దాదాపుగా ఇక్కడ హోరాహోరీ తప్పదని తేల్చి చెబుతున్నాయి. అదే సమయంలో ఎవరికి ఎడ్జ్ ఉందన్న దానిపై సర్వే సంస్థలు తమ అంచనాలను బయటకు చెబుతున్నాయి. ఇదే క్రమంలో రాజకీయాలలో తనకంటూ పేరు సంపాదించుకున్న ప్రముఖ సర్వే సంస్థ లోక్ పోల్ .. తాము జార్ఖండ్‌లో చేపట్టిన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది.
దీనిలో జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని తమ సర్వేలో లోక్ పోల్ తేల్చి చెప్పింది. ఇండియా కూటమికి 41- 44 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు లోక్ పాల్ తమ తాజా సర్వే రిపోర్ట్ లో వెల్లడించింది. అలాగే ఎన్డీయే కూటమికి 36-39 సీట్లు వస్తాయని ..ఇతరులకు 3- 4 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది.
జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 42 సీట్లు అవసరం పడుతుంది.అలాగే ఇండియా కూటమికి 39 – 41 శాతం ఓట్లు వస్తాయని లోక్ పోల్ తమ సర్వేలో అంచనా వేసింది. అటు ఎన్డీయే కూటమికి 38- 40 శాతం ఓట్లు వస్తాయని లోక్ పాల్ అంచనా వేస్తోంది. ఇతరులకు 18- 20 శాతం ఓట్లు వస్తాయని చెబుతోంది. జార్ఖండ్‌లోని ప్రతీ నియోజకవర్గంలో.. 500 శాంపిల్స్ చొప్పున మొత్తం 40వేల500 శాంపిల్స్ సేకరించి ఈ సర్వే చేసినట్లు తాజాగా లోక్ పోల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.