దీపావళికి ముందే ఢిల్లీవాసులకు కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడటం తెలిసిందే. అయితే ఈ ఏడాది మరింత ముందుగా హస్తినలో వాయు కాలుష్యం పెరిగిపోయినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరిస్తోంది.
దీపావళి పండుగకు ముందే వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజాగా పేర్కొంది. ముఖ్యంగా.. ఆనంద్ విహార్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 334 గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకటించింది.
చలి తీవ్రత పెరగడంతో పాటు వాయు వేగం తగ్గడంతో ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వివరించింది. ప్రధానంగా పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనం వల్ల రాజధాని ఢిల్లీని పొగ అలిమేస్తోందన్న విషయం తెలిసిందే. తాజాగా దీనివల్లే పొల్యూషన్ పెరిగిపోయిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తేల్చింది. ఈ వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ల మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనూ ఇబ్బందులు పడుతున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెబుతున్న దాని ప్రకారం.. ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్వానంగా ఉన్నట్లు తేలింది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని.. కాలుష్యం లేదని అర్థం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్ధం.
అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగోలేదని.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400-500 మధ్య ఉంటే తీవ్ర స్థాయిలో ఉందని అర్థం. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే.. ఇంకా, చలికాలం ప్రారంభం కాకముందే.. దీపావళి కంటే ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థితికి చేరుకోవడం చాలా మందిని కలవరపెడుతోంది.