రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి అభ్యర్థి కమలా హారిస్‌పై ఆధిక్యం సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గానూ.. సాధారణ మెజార్టీకి అవసరమైన 270 మార్క్‌ను ట్రంప్ సాధించారు. దీంతో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెషన్ సెంటర్‌లో మాట్లాడుతూ.. ఇది గొప్ప విజయమని, ఇంతట ఘనవిజయం అందించినందుకు అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. స్వింగ్ రాష్ట్రాల్లో విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అమెరికా ఇలాంటి గెలుపు ఎన్నడూ చూడలేదని, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని అన్నారు. ఎన్నికల సమరంలో రిపబ్లికన్‌లు గొప్పగా పోరాటం చేశారన్నారు.
కాగా మన తెలుగు రాష్ట్రానికి చెందిన అల్లుడే అగ్రరాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ఎవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉషా చిలుకూరి భర్తే. దీంతో ఉషా చిలుకూరి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత ఎన్నికల్లో జో బైడెన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన కమలా హారిస్ మూలాలు ఇండియాకు చెందినవి అని తెలిసి అంతా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారనే వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత గర్వపడుతున్నారు.
విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి.. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ఉష పూర్వీకుల మూలాలు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉండగా.. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు.