జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత కెనడాలో ప్రధానమంత్రి పదవి కోసం కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కొత్త నేతను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో భారతీయ సంతతికి చెందిన అనితా ఆనంద్ (Anita Anand) ప్రధానమంత్రి రేసులోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రధానమంత్రి పదవి రేసులో తనకు ఎలాంటి ఆసక్తి లేదని గతంలో స్పష్టం చేసిన అనితా ఆనంద్, తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం, అంటే రేపు, ఆమె తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. CBC న్యూస్ నివేదికల ప్రకారం, అనితా ఆనంద్ కెనడా లిబరల్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడే అవకాశం ఉంది. అంటారియోలో ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
1967 మే 20న కెనడాలోని కెంట్‌విల్లేలో జన్మించిన అనితా ఆనంద్ తల్లి పంజాబ్‌కు, తండ్రి దక్షిణ భారతదేశానికి చెందినవారు. ఆమె న్యాయవాదిగా, ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించి, 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ట్రూడో మంత్రివర్గంలో రవాణా మంత్రి, అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికైన ఆమె, 2021లో మరోసారి ఓక్‌విల్లే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ట్రూడో జనవరి 6న రాజీనామా చేసిన తర్వాత, మార్చి 9న కొత్త నేత ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.
మొదట ప్రధానమంత్రి రేసులోకి రావడం లేదని స్పష్టం చేసిన అనితా ఆనంద్, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.