పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవగా, సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగనుంది. కాగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా భవానీపూర్ స్థానం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండడంతో ఈ ఉపఎన్నికకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున ప్రియాంక టైబ్రెవాల్, సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు.
మరోవైపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, స్థానిక బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఇక ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కూడా నేడే జరుగుతుంది. ఈ నాలుగు చోట్ల అక్టోబరు 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
ముందుగా గత బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో పోటీచేసిన మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. పార్టీ సంచలన విజయం సాధించడంతో ఆమె సీఎం పదవీ చేపట్టారు. అయితే సీఎం పదవీలో కొనసాగాలంటే ఆమె ఆరు నెలల్లోగా మళ్లీ అసెంబ్లీకి ఎన్నికావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వినతి మేరకు ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. గత ఎన్నికల్లో భవానీపూర్ స్థానంలో గెలిచిన తృణమూల్ నేత సోభాందేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నికకు అవకాశం ఏర్పడింది. దీంతో మమతాబెనర్జీ భవానీపూర్ ఉపఎన్నికలో బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ విజయం సాధిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా సీఎం పదవిలో కొనసాగేందుకు ఆమెకు మార్గం సుగమం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ