బీహార్లో రాజకీయ వేడి కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ప్రశాంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రెండో విడత పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరగనుంది.
పోలింగ్ వివరాలు, భద్రతా ఏర్పాట్లు:
పోలింగ్ స్థానాలు: 243 అసెంబ్లీ స్థానాలకు గానూ, తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
పోలింగ్ కేంద్రాలు: మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
అభ్యర్థులు: రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది (దాదాపు 10 శాతం) మహిళా అభ్యర్థులు ఉన్నారు.
భద్రత, సిబ్బంది: పోలింగ్ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 4 లక్షలకుపైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
ప్రాంతాలు: రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి.
ముఖ్యమైన ప్రాంతాలు:
బీజేపీ, జేడీయూ: బీజేపీకి సంప్రదాయకంగా తిర్హుత్, సారణ్, ఉత్తర మిథిలాంచల్ ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు భాగల్పూర్ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది.
మహాఘట్ బంధన్: ఇక విపక్ష మహాఘట్బంధన్కు మగధ్ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలో గయ, ఔరంగాబాద్, నావడ, జెహనాబాద్, అర్వాల్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ తన మిత్రపక్షాల బలంపైనే ఆధారపడింది.
ఓట్ల లెక్కింపు: రెండు దశలకు కలిపి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.







































