పదేళ్లుగా దేశంలో అప్రతిహతంగా అధికారంలో ఉన్న బీజేపీకి మోదీ, అమితషా రెండు కళ్లు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మూడో నేత్రం. ఈ ముగ్గురి కృషితోనే బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటుంది. మూడోసారి అధికారంలోకి వచ్చింది. అనేక రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది.
బీజేపీకి నరేంద్ర మోదీ, అమిత్ షా రెండు కళ్లు అయితే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడో కన్నుగా ఉంటున్నారు. ఈ పదేళ్లలో ముగ్గురు జాతీయ అధ్యక్షులు మారగా.. ముగ్గురు కూడా దిగ్విజయంగా పార్టీని నడిపించారు. ప్రస్తుత అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా వరుసగా రెండు సార్లు పనిచేశారు. ఆయన పదవీ కాలం మార్చి 1తో పూర్తయింది. దీంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
మార్చి 15 లోగా నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశముంది. బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, అగ్రనేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డే వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. కొత్త జాతీయ అద్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎలక్షన్స్ పూర్తి చేయాల్సి ఉండగా.. 12 రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కనీసం మరో ఆరు రాష్ట్రాల్లో అయినా యూనిట్ చీఫ్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో కమలం పెద్దలు తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ , అసోం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలకోసం ప్రణాళిక రూపొందించారు.
కాగా 2019 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక నడ్డాను ఏకగ్రీవంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగించింది. దీంతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది.