Video: పెళ్లైన రెండో రోజే వధువు ప్రసవం.. షాక్‌లో వరుడి కుటుంబం!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ వివాహితురాలు పెళ్లయిన రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని ఆశించిన వరుడికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి వేడుకలు ముగిసిన రెండు రోజుల్లోనే నవ వధువు ప్రసవించడం అతడి కుటుంబాన్ని తీవ్రంగా దిమ్మతిరిగేలా చేసింది.

ఫిబ్రవరి 24న ఓ జంట ఘనంగా వివాహం చేసుకుంది. మరుసటి రోజున వధువు అత్తారింట అడుగు పెట్టింది. ఫిబ్రవరి 26న ఉదయం కొత్త కోడలు ఇంటిల్లిపాది కోసం టీ కూడా కాచి ఇచ్చింది. కానీ అదే రోజు సాయంత్రానికి ఆమె అకస్మాత్తుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడసాగింది. పరిస్థితి విషమించడంతో వరుడు, అతని కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి, పురిటినొప్పులు వచ్చినట్లు చెప్పారు. కొద్దిసేపట్లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీన్ని చూసిన వరుడు, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివాహం అయిన రెండు రోజుల్లోనే వధువు ప్రసవించడంతో తాము మోసపోయామని నొచ్చుకున్నారు.

డెలివరీ చేసిన వైద్యులు శిశువును తెచ్చి వరుడి కుటుంబానికి అప్పగించారు. దీంతో అవాక్కైన నవ వరుడు తన భార్యను అంగీకరించలేనని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై వరుడి సోదరి స్పందిస్తూ, “వధువు పెద్ద లెహంగా ధరించిందని, అందువల్ల ఆమె గర్భవతి అన్న విషయం తెలియలేదని” తెలిపింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతూ, ఈ ఘటనపై విచిత్రమైన ప్రతిస్పందనలు ఇస్తున్నారు.