ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార సంస్థ డైరెక్టర్ దల్జీత్ సింగ్ (Daljit Singh), తన జీవితంలో ఒంటరిగా ఉన్నాడు. జీవిత భాగస్వామిని వెతుక్కోవాలనే ఆలోచనతో గతేడాది డిసెంబరులో ఓ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్‌ను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో అతనికి అనిత అనే యువతి పరిచయమైంది. తాను హైదరాబాద్‌కు చెందినదని చెప్పిన ఆమె, మెల్లగా సింగ్‌తో చక్కని స్నేహం పెంచుకుంది.
కొద్ది రోజుల పాటు నిత్యం మాట్లాడుకోవడంతో వీరి స్నేహం మరింత బలపడింది. ఈ నమ్మకాన్ని ఉపయోగించుకున్న అనిత తన అసలు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి దల్జీత్‌ను ప్రేరేపించింది. మొదటిగా రూ. 3.2 లక్షలు పెట్టిన అతనికి అనిత వెంటనే మంచి రాబడిని చూపించి, అతని విశ్వాసాన్ని మరింత పెంచింది.
దీంతో ముంచుకు పోయిన సింగ్, తన పొదుపు మొత్తం, దాదాపు రూ. 4.5 కోట్లు ట్రేడింగ్‌కు పెట్టుబడిగా పెట్టాడు. అంతే కాకుండా, అనిత ప్రోత్సాహంతో మరో రూ. 2 కోట్లు రుణంగా తీసుకుని పెట్టుబడి పెట్టాడు. మొత్తం 30 లావాదేవీల ద్వారా రూ. 6.5 కోట్లను 25 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
అయితే, ఒకరోజు తన పెట్టుబడిని విత్‌డ్రా చేయాలని చూస్తే కేవలం 30% మాత్రమే తిరిగి వస్తుందని చెప్పడంతో అతనికి అనుమానం వచ్చింది. అప్పటికే తనను మోసం చేశారని గ్రహించిన సింగ్, నోయిడాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అనిత డేటింగ్ ప్రొఫైల్ పూర్తిగా నకిలీదని తేలింది. ఆమె వినియోగించిన బ్యాంక్ ఖాతాల సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.