గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. దీనిలో తాజాగా 1952లో అమలులోకి వచ్చిన సినిమాటోగ్రాఫ్ చట్టానికి సంస్కరణలు తీసుకురావడమైందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి డా. ఎల్. మురుగన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా రాజ్యసభలో ఈ కీలక సవరణలను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ.. “పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు తీరని నష్టం జరుగుతోంది. కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకుని, నిర్దాక్షిణ్యంగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. పైరసీకి పాల్పడేవారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేందుకు కొత్త చట్టం మార్గం సుగమం చేస్తుంది.’ అని పేర్కొన్నారు. వీటితోపాటు కొత్తగా చట్టంలో 6AA మరియు 6AB సెక్షన్లు కూడా చేర్చినట్టు ఆయన తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “డిజిటల్ పైరసీని అరికట్టడానికి మరియు భారతదేశ వినోద పర్యావరణ వ్యవస్థ సమగ్రతను రక్షించడానికి ప్రభుత్వం సంబంధిత వాటాదారులు, చట్ట అమలు సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. పైరసీ నిరోధక వ్యూహాలను బలోపేతం చేయడానికి మరియు సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి ఒక అంతర్-మంత్రిత్వ శాఖా కమిటీని ఏర్పాటు చేసింది” అని చెప్పారు.
ఇక కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర చిత్ర పరిశ్రమల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ పైరసీ రూపంలో ఎదురవుతున్న సవాలును ఎదుర్కొనడంలో ఇది ఒక నిర్ణయాత్మక అడుగుగా వ్యవహరిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరియు బయ్యర్లు వంటి పరిశ్రమకు చెందిన అనేక వర్గాలవారు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం సినిమాలకు ఆర్థిక రీత్యా రక్షణ కలిగించడమే కాదు, సృజనాత్మకతను కూడా ప్రోత్సహిస్తుందని వారు పేర్కొంటున్నారు.
పైరసీ సమస్యను పరిష్కరించడానికి, తాజాగా కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన కీలక సంస్కరణలు ఇవే..!
- ఇకపై ఎవరైనా సినిమా పైరసీకి పాల్పడితే ఇంతకుముందు ఉన్న కనీసం 3 నెలల జైలు శిక్ష మరియు ₹3 లక్షల జరిమానాను.. 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఆడిట్ చేయబడిన సినిమా నిర్మాణ వ్యయంలో 5% వరకు పొడిగించారు.
- సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6AA మరియు 6AB సినిమాలను అనధికారికంగా రికార్డింగ్ చేయడం మరియు ప్రసారం చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు.
- సినిమాటోగ్రాఫ్ చట్టంలో కొత్తగా చేర్చబడిన సెక్షన్ 7(1B)(ii) పైరసీ కంటెంట్‌ను హోస్ట్ చేస్తున్న మధ్యవర్తులకు (intermediaries) అవసరమైన ఆదేశాలను జారీ చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
- సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, కాపీరైట్ హోల్డర్లు లేదా అధీకృత వ్యక్తుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు అలాంటి కంటెంట్‌ను హోస్ట్ చేస్తున్న మధ్యవర్తులకు అవసరమైన ఆదేశాలను జారీ చేయడానికి అధికారం ఉంటుంది.