ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ (36)ను దాటేసింది. దీంతో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదట్లోనే ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చింది. ముఖ్య నేతలు వెనుకంజలో ఉన్నారు. మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసినా, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ముందంజలో ఉన్నారు. అలాగే కాల్కాజీలో సీఎం అతిశీ, జంగపూర్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు బాదిలి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉండటం గమనార్హం. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
ఇక బురారి, మాలవ్యనగర్, దేవ్‌లీ స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం బీజేపీ 31 స్థానాల్లో, ఆప్ 25 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగగా, 60.54 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 36.
ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, కేజ్రీవాల్ మాత్రం ఆ అంచనాలను కొట్టిపడేశారు. అయితే, ఓట్ల లెక్కింపు ఫలితాలు అందుతున్న కొద్దీ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఢిల్లీ పీఠానికి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలుపుపై ధీమాగా ఉంది. మరోవైపు 2013 నుంచి వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 10 వేల మంది పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం నాటికి పూర్తి ఫలితాలు స్పష్టతకు వస్తాయని అంచనా. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే, బీజేపీ విజయోత్సవం జరుపుకునే పరిస్థితి కనిపిస్తోంది.