డేంజర్‌లో ఢిల్లీ.. వెరీపూర్‌ కేటగిరిలో గాలి నాణ్యతలు

Delhi In Danger Air Quality In Very Poor Category | Mango News Telugu

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ఢిల్లీలో వెరీ పూర్‌ కేటగిరీలో గాలినాణ్యతలు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం 8 గంటలకు 355 వద్ద ఎయిర్‌ క్వాలిటీ నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది

వాయుకాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని అయినా కూడా.. గతంలో ఎప్పుడూ ఇక్కడ ఇంత కాలుష్యం లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. రెండు, మూడేళ్ల నుంచే వాయు కాలుష్యం పెరిగిపోయిందని.. ప్రత్యేకంగా శీతాకాలంలో కాలుష్యం పెరుగుతోందని అంటున్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం బాణాసంచా నిషేధంపైనే దృష్టి పెడుతుంది తప్ప..అసలు వాయు కాలుష్యం పెరగడానికి గల మిగతా కారణాలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు అక్కడ వినిపిస్తున్నాయి. అందుకే వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పక్కన ఉన్న రాష్ట్రాలు పంట వ్యర్థాలను దగ్ధం చేస్తున్నాయి. వాటిని నివారించినా కూడా వాయు కాలుష్యం తగ్గుతుందని..వెంటనే కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

మరోవైపు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో..జహంగిరిపురి 417, రోహిని 415, ముండ్కా 404, ఆనంద్‌ విహార్‌ 403, అశోక్‌ విహార్‌ 390, ప్రతాప్‌గంజ్‌ 371, ద్వారకా సెక్టార్‌ 367, లోధి రోడ్‌ 313, నజాఫ్‌గర్‌ 355, నరేలా 356, పూసా 320, ఆర్‌కె పురం 365, వివేక్‌ విహార్‌ 385లుగా ఎయిర్‌ క్వాలిటీ నమోదయినట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం వాయు కాలుష్యానికి చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని..లేదంటే భవిష్యత్తులో ఢిల్లీ లో ఉండటానికి కూడా ప్రజలు భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.