భారతదేశంలో ఉన్న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను బ్లూ సిటీగా పిలుస్తారు. ఇది ప్రపంచంలో గల ఏకైక బ్లూ సిటీగా గుర్తించబడింది. ఇక్కడ నివసించడం నుంచి భోజనం, ప్రయాణం అన్నీ కూడా చాలా చౌకగానే లభిస్తాయి. ఇక్కడ ఉండే ఇల్లు, ఎత్తైన భవనాలు అన్నీ కూడా నీలిరంగులో నిగనిగలాడుతూ ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే దీన్ని బ్లూ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బ్లూ సిటీని చూడటానికి ప్రత్యేకించి వస్తారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరం సుమారు 650 సంవత్సరాల క్రితం స్థిరపడిందని చరిత్రకారులు చెబుతుంటారు. జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రాథోడ్ వంశానికి చెందిన రావ్ జోధా రాజ్‌పుత్ స్థాపించారని చెబుతారు. ఎత్తైన కొండపై బ్లూ సిటీని నిర్మించారు. కానీ జనాభా పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా అనేక ఇళ్లను నిర్మించారు. ఎటు చూసినా బ్లూ కలర్ భవనాలే దర్శనమిస్తాయి.
జోధ్‌పూర్ నగరం పర్యాటక పరంగా కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బ్లూ సిటీని చూసి ఆశ్చర్యపోతారు. ఎంతో గొప్పగా అక్కడ అణువణువు పర్యాటకుల్ని ఆకర్షించేలా ఉంటుంది.అందుకే జోధ్‌పూర్ మంచి పర్యాటక ప్రదేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక రాజభవనాలు, కోటలు, దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలు విదేశీయులనే కాదు ప్రతి ఒక్కర్నీ కట్టేపడేస్తుంటాయి. ఇక్కడ చూడాల్సిన అద్భుతమైన కట్టడాలు, రాజభవనాలు ఎన్నో ఉన్నాయి.
అద్భుతమైన కట్టడాలు, రాజభవనాలలో ప్రధానమైన ఉమైద్ భవన్ ప్యాలెస్, జస్వంత్ థాడా, క్లాక్ టవర్ ను చూడటం ఏ పర్యాటకులు కూడా అస్సలు మిస్ అవరు. అలాగే మాండోర్ గార్డెన్, కైలానా సరస్సు, బాల్సమండ్ సరస్సు,మసూరియా హిల్స్, రతనాడ గణేష్ ఆలయం, వీర్ దుర్గాదాస్ స్మారక చిహ్నం, సుర్పురా డ్యామ్, భీమ్ భడక్ గుహ , మచియా బయోలాజికల్ పార్క్, రావు జోధా ఎడారి రాక్ పార్క్ వంటివి అందరినీ ఆకట్టుకుంటాయి.