ప్రయాగ్‌రాజ్‌లో ఆరో రోజు మహా కుంభమేళా కన్నుల పండువగా జరుగుతోంది. మహా కుంభమేళాకు భారీగా తరలివస్తున్న భక్తులు..త్రివేణిసంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు 7కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13 నుంచి ప్రారంభమయిన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ దాదాపు నలభై అయిదు రోజులపాటు జరుగుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతారు. గంగమ్మతల్లిని మనసారా పూజించడమే ఈ వేడుక అసలైన పరమార్థంగా వేదపండితులు చెబుతుంటారు.
మహా కుంభ మేళా జరుపుకోవడం వెనుక ప్రధానంగా ఒక కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించగా.. ఆ పాత్రకోసం దేవతలు- రాక్షసులు పోరాటం సాగిస్తారు. ఆసమయంలో అందులోంచి నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయి. దాంతో ఆ నాలుగు నదులూ అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని చెబుతున్నాయి. అలా ఆ అమృత చుక్కలు.. హరిద్వార్‌లోని గంగ, ఉజ్జయినిలోని శిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పడ్డాయని అంటున్నాయి. దీనివల్లే ఆయా నదుల్లోని నీళ్లు అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతుంటారు. అలా ప్రత్యేకంగా వచ్చే సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు.
ఆసమయంలో ఈ నదుల్లో స్నానం చేయడానికి కోట్లాదిమంది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతీ సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగా కుంభమేళాను అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా అని రెండు రకాలుగా జరుపుతారు. అర్ధ కుంభమేళాని ఆరేళ్లకోసారి చేయగా.. మహా కుంభమేళా పన్నెండేళ్లకోసారి నిర్వహిస్తారు. పన్నెండేళ్లకొకసారి వచ్చే మహా కుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు.
బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 ఏళ్లు పడుతుంది గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. అలా ఇప్పుడు మహా కుంభమేళా జరుగుతోంది. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానంచేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.అయితే మహా కుంభమేళా ప్రతిసారీ ఒకేచోట జరగదు. ఇప్పుడు కుంభమేళా వేదిక ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమమే అయినా.. వచ్చేసారి బృహస్పతీ సూర్యచంద్రుల కదలికల్ని బట్టి.. మిగిలిన మూడు నదుల్లో ఎక్కడైనా జరుపుతారు.
కోట్లాదిమంది జనం ఉన్నా కూడా అత్యంత ప్రశాంతంగా, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళా.. ఒక్క పుణ్య స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదని అంటారు పండితులు. సామాన్యులతో పాటు అపర శివ-విష్ణు భక్తులైన ఆఘోరాలూ, సాధువులూ, ఆధ్యాత్మిక వేత్తలూ, పండితులూ… ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు.
ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణీ సంగమంలో ఉండే ఘాట్‌లలో నదీమతల్లికి ఇచ్చే హారతుల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. ప్రతిఏటా ఈ మాసంలో మాఘ్‌మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు నలభైరోజులు సాగే ఈ మాఘ్‌మేళాలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు ఇక్కడకు వస్తారు. వీళ్లంతా ఈ నలభైరోజులూ ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు.