కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది వివాదాస్పద బిల్లు అని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. ఇన్నాళ్లకు ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. వక్ఫ్ బిల్లుపై నేడు అంటే ఏప్రిల్ 2న పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు పార్లమెంటుకు తప్పకుండా హాజరుకావాలని వారి పార్లమెంట్ సభ్యులకు అల్టిమేటం కూడా జారీ చేశాయి.
కాగా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి నాలుగు ప్రతిపాదనలను టీడీపీ కేంద్రం ఎదుట ఉంచగా.. వాటిలో మూడింటిని కేంద్రం ఆమోదించడంతో తెలుగుదేశం పార్టీ మార్కు కనిపించదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో అనేక వివాదాస్పదమైన అంశాలున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం కావాలని తేనె తుట్టె వంటి సున్నితమైన అంశాన్ని ఇప్పుడు కదుపుతోందని విమర్శిస్తున్నాయి. దీనివల్ల హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతిస్తోందని ఆరోపిస్తున్నాయి.
నిజానికి చాలామంది వక్ఫ్ అనే పదానికి అర్థం తెలీదు. వక్ఫ్ అంటే దాతృత్వం లేదా మతపరమైన విరాళం. వక్ఫ్ అనేది ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువగా స్థిరాస్తి రూపంలో ఉంటుంది. వక్ఫ్ కు సంబంధించి ఎక్కువ భాగం స్థిరాస్తులు.. చెల్లుబాటు కాని పత్రాలు లేకుండానే ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మసీదులకు, మదర్సాలకు, స్మశాన వాటికలకు, ముస్లిం అనాధ ఆశ్రమాల నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంది.
వక్ఫ్‌ను ఒక ఆస్తిగా నిర్ధారించాక.. దానిని ఒక వ్యక్తి లేదా సంస్థకు బదిలీ చేయడానికి కానీ అమ్మడానికి కానీ అస్సలు సాధ్యం కాదు. అయితే ఇప్పటివరకూ భారత దేశంలో 10 లక్షల ఎకరాల భూములు, 8.72 లక్షల ఆస్తులు అన్నీ కూడా వక్ఫ్ బోర్డు నియంత్రణలో ఉన్నాయి. తాజాగా వక్ఫ్ బిల్లులో కేంద్రం తీసుకొచ్చిన సవరణలను ముస్లింలు వ్యతిరేకించడంతో..అవి వివాదాస్పదంగా మారాయి.ఎందుకంటే కేంద్రం తీసుకువచ్చిన సవరణలతో.. వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తుల వివాదాలను పరిష్కరించే బాధ్యత అంతా ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఉండబోతోంది. దీంతో ముస్లింలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
బుధవారం పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెడుతున్న వక్ఫ్ బిల్లులో ఐదు ప్రతిపాదిత సవరణలుండగా.. వాటిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి ముస్లిం సంస్థ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి.కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిం సామాజిక వర్గానికి చెందనివారు కూడా సభ్యులుగా చేరొచ్చనే ప్రతిపాదనను కేంద్రం తప్పనిసరి చేసింది.
వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఏదైనా వివాదం ఉంటే.. అది ప్రభుత్వానికి దక్కుతుందా? వక్ఫ్ కు దక్కుతుందా? అనే విషయాలకు సంబంధించిన తుది నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తీసుకుంటారు.దీంతోనే అసలు సమస్య అంటూ ముస్లింలు అడ్డుపడుతున్నారు. ప్రభుత్వంలో పని చేస్తున్న ఏ అధికారి అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ నిర్ణయం తీసుకోరు. అటువంటప్పుడు తీర్పు తమకు అనుకూలంగా అసలు ఉండదని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి.
అలాగే జిల్లా న్యాయమూర్తి, సంయుక్త కార్యదర్శి హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ అధికారిని వక్ఫ్ ట్రిబ్యూనల్ బోర్డులో చేర్చాలని కూడా ఈ బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయోచ్చని కూడా ఈ బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ బిల్లు గనుక చట్టంగా అమల్లోకి వస్తే కనుక 6 నెలల లోపు ప్రతి వక్ఫ్ ఆస్తిని కేంద్రం తన పోర్టల్ లో నమోదు చేయాలి.
మరోవైపు వక్ఫ్ ట్రిబ్యునల్ ఎంపిక చేసిన వక్ఫ్ బై యూజర్ క్లాజ్ ను తొలగించడానికి తీసుకొచ్చిన ప్రతిపాదనను కూడా ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ నిబంధన ప్రకారం ఆస్తిని మతపరమైన లేదా ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే కనుక.. ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండానే ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణిస్తారు. అయితే తర్వాత దీనిని తొలగించాలని వక్ఫ్ బిల్లులో కేంద్రం పొందుపరిచింది. ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ సిఫారసు చేసిన తర్వాత దీనిని తొలగించాలంటూ.. జాయింట్ పార్లమెంట్ కమిటీ కేంద్రానికి సూచించింది.