కోల్‌కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై.. శనివారం తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్లు వైద్యసేవలను నిలిపివేసి ‘స్టెత్ డౌన్’ ద్వారా నిరసనను తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అన్ని వైద్యసంఘాలు కలిసి ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఒకరోజు ఓపీ సేవలు నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది.
శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు ఓపీకి డాక్టర్లు దూరంగా ఉండాలని వైద్య సంఘాలు కోరాయి. దీనికి నగరవాసులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఐఎంఏ పిలుపుతో ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులు శనివారం ఓపీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇటు ఐఎం ఏ, జూనియర్ డాక్టర్ల సమ్మెకు తాము కూడా మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. ప్రభుత్వ వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలంటూ విజ్ఞప్తి చేసింది.
అయితే ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేద రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 నుంచి 10 వరకు ఒక గంటపాటు ఓపీ సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చింది. జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉండటం వల్ల అవసరమైతే సీనియర్ డాక్టర్లంతా గంట ఎకువగా పనిచేసి ఓపీ సేవలకు ఆటంకం కలుగకుండా చూడాలని కోరింది. కోల్‌కతా ఘటన వెనుక జరిగిన విషయాన్ని వెలికితీసి, దోషులను కఠినంగా శిక్షించాలంటూ టీపీహెచ్‌డీఏ డిమాండ్ చేసింది. శనివారం డాక్టర్లతో పాటు వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరింది.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా డాక్టర్లు, వైద్యసిబ్బందికి పటిష్ఠమైన భద్రత కల్పించేలా అన్ని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి శనివారం జరిగే ధర్నాలో పాల్గొననున్నట్టు వెల్లడించింది. ధర్నాలో పాల్గొంటామని తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఒకరోజు సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తెలిపగా.. స్టెప్ డౌన్ ధర్నాకు సీపీఐ కూడా మద్దతు పలికింది.
కోల్‌కతాలో ఘటనతోపాటు తెలంగాణలోని షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నర్సింగ్ ఆఫీసర్‌పై దాడి, అలాగే ఉత్తరాఖండ్‌లో ఓ నర్సుపై హత్యాచార ఘటనపై తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ కూడా సీరియస్‌గా స్పందించింది. శనివారం ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చింది. అయితే పేద రోగులకు ఇబ్బందులు కలగకుండా 9 నుంచి గంటసేపు మాత్రమే నిరసన ప్రదర్శన చేయాలని తెలిపింది.
ఇటు తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బందికి భద్రత కల్పించాలని.. సంబంధిత ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికే ఆదేశించారు. కోల్‌కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు దామోదర రాజ నర్శింహ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో భద్రతా అంశాలను పొందుపరిచిందని చెప్పారు.