హెచ్‌-1బీ లాటరీ పద్ధతి రద్దుకు ప్రతిపాదించిన ట్రంప్ పాలక వర్గం

Donald Trump Administration Proposes to Scrap Lottery System to Select H-1B Visas

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేసింది. వేరే దేశాల టెక్నాలజీ నిపుణులకు జారీచేసే హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ప్రతిపాదన తీసుకోవచ్చారు. లాటరీ పద్దతిని రద్దు చేసి, అధిక వేతన స్థాయి ఆధారంగా కొత్త వ్యవస్థతో భర్తీ చేయాలని ప్రతిపాదిస్తూ బుధవారం నాడు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించారు. ఈ నోటిఫికేషన్‌పై స్పందించేందుకు 30 రోజుల సమయం ఇస్తున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్‌ఎస్) వెల్లడించింది.

అమెరికాలో యువతకు ఉద్యోగ భద్రత కల్పించే నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాల జారీలో ట్రంప్ పాలక వర్గం  అనేక నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల జారీని డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా నిషేధించారు. తాజాగా ప్రతి సంవత్సరం 65 వేల మందికి హెచ్‌-1బీ వీసాలు జారీచేసే లాటరీ పద్ధతికి కూడా స్వస్తి చెప్పేందుకు అడుగులేస్తున్నారు. లాటరీ పద్దతి ద్వారా అమెరికా కంపెనీలు తక్కువ వేతనానికే విదేశీ ఉద్యోగులను తీసుకోవడంతో, స్థానిక అమెరికా యువతకు అవకాశాలు లభించడం లేదని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తుంది. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకే వీసాలు జారీచేసేలా కొత్త విధానం తెస్తే, అమెరికా ఉద్యోగులకు భద్రతతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లాటరీ పద్ధతి రద్దుకు ప్రతిపాదన తెచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనుండడం, కొత్త పాలకవర్గం ఆమోదం వంటి అనేక అంశాలు ముడిపడిఉండడంతో లాటరీ పద్దతి రద్దుపై పూర్తిస్థాయి నిర్ణయానికి వేచి చూడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu