రన్యారావు కేసులో DRI విచారణ షురూ..

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల అరెస్టైన కన్నడ హీరోయిన్ రన్య రావు గురించి ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకే ఏడాదిలో 30 సార్లు దుబాయ్ కు వెళ్లిన రన్య.. అంతేకాకుండా ఆమె ఒక్కో ట్రిప్లో కిలోల కొద్దీ బంగారాన్ని ఇండియాకు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా రన్యరావు విచారణలో మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

తాజాగా గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్య రావుకు చుక్కెదురయ్యింది. రన్య రావును కోర్టు.. మూడు రోజుల పాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ కస్టడీకి అప్పగించింది .దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆమెను DRI అధికారులు విచారించబోతున్నారు. లాస్ట్ ట్రిప్పులో 14.2 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ రన్య రావు విచారణలో.. ఇప్పటికే సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

రన్య రావ్‌ మొత్తం 30 సార్లు దుబాయ్‌కు వెళ్లారని DRI అధికారులు వెల్లడించారు. ప్రతిసారి ఒకే డ్రెస్‌తోనే దుబాయ్‌ నుంచి రన్యరావు తిరిగిరావడం అధికారులు గుర్తించారు. ఆ డ్రెస్ లోనే ఆమె గోల్డ్‌ని స్మగ్లింగ్‌ చేశారని తెలిపారు. గత 15 రోజుల్లోనే 4 సార్లు, 2నెలల్లో పదిసార్లు దుబాయ్‌కి వెళ్లొచ్చారు. ఒకో ట్రిప్పునకు రన్య రావుకు రూ. 10 నుంచి 50 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ ద్వారా నెలకు కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకూ ఆదాయం ఆర్జించేదని విచారణలో తేలింది. దుబాయ్‌తోపాటు, యూరప్‌, అమెరికాకు కూడా వెళ్లినట్లు విచారణలో రన్యా వెల్లడించారు.

షూ, బెల్టులో గోల్డ్‌ బిస్కెట్లు దాచి రన్య గోల్డ్ స్మగ్లింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగాక, సాధారణ ప్రయాణికుల ఎగ్జిట్‌ నుంచి కాకుండా, ఓ కానిస్టేబుల్ సహాయంతో..తక్కువ చెకింగ్‌ ఉండే వీఐపీ ఎగ్జిట్‌ నుంచి రన్యా రావు బయటపడేదని తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్టులో రన్య రావుకు ఇన్నాళ్లూ సాయం చేసిన కానిస్టేబుల్‌ స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు రికార్డ్ చేశారు. ఇక DRI కస్టడీలో రన్య రావ్‌ నుంచి ఎలాంటి విషయాలను అధికారులు రాబడుతారనేది ఆసక్తికరంగా మారింది.