కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ రోజుకు ఒక కోడిగుడ్డు అయినా తినాలంటారు డాక్టర్లు. ఇక కరోనా వైరస్ దెబ్బకు రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి చాలా మంది ఎగ్ తినడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత గుడ్ల ధరలకు రెక్కలొచ్చి ఏకంగా 40 శాతం పెరిగాయి. గుడ్ల ధరల పెంపుపై డెమోక్రాట్లు నిరసనకు దిగగా. అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో డజను గుడ్ల ధర ఇండియా కరెన్సీ ప్రకారం రూ.603 కు విక్రయిస్తున్నారు. గడ్డు ఇంత ఖరీదైనదిగా మారడానికి ట్రంపే కారణమని డెమోక్రటిక్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎందుకంటే అమెరికాలో పెరుగుతున్న ధరలను అదుపుచేయడానికి ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాత్రం జోబైడెన్‌పై పదే పదే దాడి చేసిన ట్రంప్..ఇప్పుడు ధరలు పెరగకుండా నిరోధించడానికి ఏమీ చేయడం లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. కమోడిటీ ప్రైజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ట్రేడింగ్ ఎకనామిక్స్ చెబుతున్నదాని ప్రకారం అమెరికాలో కొన్ని నగరాల్లో గుడ్ల ధర డజన్‌కు 7 డాలర్లకు పెరగగా.. కొన్ని నగరాల్లో 6.55 డాలర్ల చొప్పున విక్రయిస్తున్నారు.
అమెరికాలో సాధారణంగానే గుడ్డు వినియోగం ఎక్కువ. చాలామంది గుడ్డు మంచి బ్రేక్‌ఫాస్ట్ అనే భావిస్తారు. ప్రతీరోజు లక్షల మంది ప్రజలు ఎగ్స్ కొంటూ ఉంటారు. కానీ, గుడ్డు ధరల తమ బడ్జెట్‌ను మించిపోతున్నాయని అక్కడివారు గగ్గోలు పెడుతున్నారు. కిరాణ సామగ్రి ధరలు తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వారం రోజులకే గుడ్ల ధర 40 శాతం పెరగడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోండటంతో పెద్ద ఎత్తున కోళ్లను చంపేస్తున్నారు. ఇప్పటి వరకు 30 మిలియన్లకుపైగా కోళ్లను చంపేయడంతో.. గుడ్ల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగినట్లు మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ట్రంప్ తీసుకున్న ఆహార దిగుమతుల పరిమితి నిర్ణయాల వల్ల కూడా గుడ్ల కొరత మరింత ఎక్కువయిందని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి ముప్పుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏవీయన్ ఇన్‌ఫ్లూఎంజా కొత్తగా అమెరికాలోకి రాలేదని 2022 నుంచి అమెరికాలో ఉందని..ఆ వైరస్ పేరుతో ధరలు పెంచడాన్ని తప్పు పడుతున్నారు.