హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రజా తీర్పును బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా ఈ అంశంపై వరుస ఆరోపణలు చేస్తున్న ఆయన తాజాగా మరోసారి హర్యానా ఎన్నికల సమయంలో ఓట్ల గల్లంతు చోటుచేసుకుందని ఆరోపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే, భారత ఎన్నికల సంఘం (EC) ఆయన వయఖ్యాలను పూర్తిగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు నిరాధారమని ఈసీ పేర్కొంది.
ఎన్నికల సంఘం వివరణ
-
నిరాధార ఆరోపణలు: హర్యానాలో ఓటర్ల జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని ఈసీ స్పష్టం చేసింది. బీజేపీ గెలుపు కోసం తమతో కుమ్మక్కయిందని రాహుల్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.
-
కోర్టులో పిటిషన్లు: 90 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 22 ఎలక్షన్ పిటిషన్లు మాత్రమే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది.
-
పోలింగ్ ఏజెంట్ల పాత్ర: పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారని ఈసీ కాంగ్రెస్‌ను నిలదీసింది. ఓటర్ల ఐడెంటిటీపై లేదా అప్పటికే ఓటు వేసినట్లుగా అనుమానం వస్తే, పోలింగ్ ఏజెంట్లు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసి ఉండవచ్చని పేర్కొంది.
ఎస్ఐఆర్‌పై ఈసీ ప్రశ్న:
పౌరసత్వ వెరిఫికేషన్‌తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ (Systematic Initiative for Revision)ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అని ఈసీ సూటిగా ప్రశ్నించింది.
ఓటర్ల జాబితా రివిజన్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారని ప్రశ్నించింది.
బిహార్‌లో అక్టోబర్ 1 నుంచి 15 వరకూ ఎస్ఐఆర్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ ఎందుకు అప్పీల్ చేయలేకపోయిందో చెప్పాలని ఈసీ నిలదీసింది.
రాహుల్ గాంధీ ఆరోపణలు:
న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఈ క్రింది ఆరోపణలు చేశారు.
-
ఓట్ల చోరీ: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, టాప్-5 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పినా బీజేపీ గెలిచిందని అన్నారు.
-
ఫేక్ ఓట్లు: ఒక నియోజకవర్గంలో ఒకే ఫోటోతో వంద ఓట్లున్నాయని, అనేక బూతుల్లో ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.
-
సీసీటీవీ ఫుటేజ్: అక్రమాలు బయటకు రావద్దని ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్‌ను డిలీట్ చేసిందని ఆరోపించారు.
-
డూప్లికేట్ ఓటర్లు: బ్రెజిలియన్ మోడల్, యూపీ బీజేపీ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, ఓటర్ల తొలగింపు ద్వారా హర్యానాలో గెలిచారని విమర్శించారు.
-
యూపీ, హర్యానాలో వేల సంఖ్యల్లో డూప్లికేట్ ఓటర్లున్నారని, బిహార్‌లోనూ ఓట్ల చోరీ జరుగుతుందని ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని బయటపెడతామని తెలిపారు.



































