అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతివ్వడమే కాకుండా పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తుండటం హాట్ టాపిక్ అయింది.
ట్రంప్ ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం ఎలాన్ మస్క్ మరో 470 కోట్లు రూపాయలను అందజేసినట్లుగా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా తాజాగా పేర్కొంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ కోసం ఇప్పటివరకు మస్క్ 1,109 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్ కోసం కానీ, బైడెన్ కోసం కానీ తనవైపు నుంచి ఆర్థిక సహకారం ఉండబోదంటూ గతంలో ప్రకటించిన ఎలాన్ మస్క్.. ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి పెద్దపెద్ద విరాళాలు ఇస్తుండటంతో అంతా విస్తుపోతున్నారు.
ట్రంప్ కోసం విరాళాలు ఇవ్వడమే కాదు ఏకంగా ఆయన కోసం మస్క్ ముమ్మర ప్రచారాలనూ నిర్వహిస్తున్నారు. ఫిలడెల్ఫియాలో ట్రంప్‌ను గెలిపించాలంటూ సోలో క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. కేవలం ట్రంప్ ప్రచార కార్యక్రమాల కోసమే..ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీ-PACని ఏర్పాటు చేసిన మస్క్ 75 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇచ్చారు.
ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే స్వింగ్ స్టేట్స్‌లో.. డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా భారీగా ఖర్చు పెడుతున్నారట. ట్రంప్‌నకు అనుకూలంగా ఓటర్లను మార్చడానికి మస్క్ తాయిలాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో వాక్ స్వాతంత్య్రం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసిన ఓటర్లను కూడా ప్రలోభపెట్టి వారికి డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదంతా ఎందుకు అంటే.. ట్రంప్ ప్రచార సమయంలో తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో చోటిస్తానని చెప్పడం తెలిసిందే. ఒకవేళ అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా మస్క్‌ను నియమించుకుంటానని ట్రంప్ ఈ మధ్య జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు. దీనిపై అప్పుడు మస్క్ సానుకూలంగా స్పందిస్తూ ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’కి నేతృత్వం వహించడానికి తాను కూడా సిద్ధమే అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.అందుకే ఇప్పుడు ట్రంప్ గెలుపు కోసం మస్క్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మస్క్ తాను సృష్టించినట్లుగా చెబుతున్న పొలిటికల్ యాక్షన్ కమిటీపై.. మిషిగన్, నార్త్ కరోలినా ఎలక్షన్ బోర్డు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పీఏసీ..ఓటర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోండటంతో పాటు అనేకమందిపై నిఘా వేస్తోందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.