దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రానుంది. ఈనెల 9న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీలు పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వారిలో ఒక ఇద్దరు ఎంపీల గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు వారు పార్లమెంట్‌లో అడుగు పెడుతారా? లేదా? అన్నది చర్చనీయాంశం అయింది. ఎందుకంటే వారు అందరిలా కాకుండా.. జైలు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. వారే ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్.
అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. అటు ఉగ్రవాదులకు నిధులు చేరవేశాడన్న ఆరోపణలతో ఇంజినీర్ రషీద్ కూడా జైలులో ఉన్నారు. అయితే తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారిద్దరు జైలు నుంచే పోటీ చేసి గెలుపొందారు. పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ పార్లమెంట్ నుంచి అమృత్ పాల్ సింగ్.. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా పార్లమెంట్ నుంచి రషీద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం వారిద్దరు జైలులో ఉండడంతో.. వారి ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తారా? అసలు వారు పార్లమెంట్‌లో అడుగు పెడుతారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే వారిద్దరు జైలులో ఉన్నప్పటికీ.. ఎంపీలుగా గెలిచినందున ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అమృత్ పాల్ సింగ్, రషీద్ ప్రమాణ స్వీకారం కోసం ముందుగా జైలు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారు అనుమతించాక.. అధికారులే వారిని భద్రత మధ్య పార్లమెంట్‌కు తీసుకెళ్లి ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత తిరిగి జైలుకు తరలిస్తారు. అయితే జైలులో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు మాత్రం అనుమతి లేదు. దీంతో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి పంపుతారు.ఆ తర్వాత సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఇకపోతే అమృత్ పాల్ సింగ్, రషీద్‌లు దోషులుగా తేలి.. వారికి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వారి లోక్ సభ సభ్యత్వం రద్దు అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE