అనగనగా ఓ మూడు ఊర్లు..అక్కడ అందరు దొంగలే!

Everyone in these villages are thieves | Mango News Telugu

ఎప్పుడైన మీ ఊర్లో గాని మీ వీధిలో గాని దొంగలు పడ్డారా.. అయితే ఆ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారనే అనుమానం మీకు రాకమానదు. సాధారణంగా కొంతమంది ఏ పని చేయలేక దొంగగా మారుతారు. కాని మధ్యప్రదేశ్ లోని ఓ మూడు ఊర్లలో అందరు దొంగతనాన్నే తమ వృత్తిగా చేసుకున్నారు. దోచుకున్న డబ్బును తెచ్చుకొని ఏడాదిలోని మిగతా నెలలను హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కాదు. కాని ఇది నిజం. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలోని కడియా సాంసీ, గుల్టేడీ, హుల్టేడీ గ్రామాల ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు, నేరాలకు పాల్పడుతూ పెద్దఎత్తున్న దోచుకుంటున్నారు. ఆయా గ్రామాలలోనే దొంగల ముఠాలు పర్మినెంటుగా నివసిస్తున్నాయి. ఏటా మూడు, నాలుగు నెలల పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఈ ముఠాలు లూటీలు, చోరీలకు తెగబడుతుంటాయట.

ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపుర్లో జరిగిన ఓ వివాహ వేడుకలో జరగిన దొంతనంతో ఈ ముఠాల గురించి దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ బడా వ్యాపారి కూతురు పెళ్లి జరుగుతుండగా  రూ.1.45 కోట్లు విలువైన ఆభరణాలు కలిగిన సంచిని ఎవరో చోరీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే ఓ 14 ఏళ్ల బాలుడు ఆ సంచిని దొంగిలించినట్లు తేలింది. ఇలాంటి చోరీలకు పాల్పడే అలవాటు మధ్యప్రదేశ్‌‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాకు చెందిన దొంగల ముఠాలకు ఉంది. ఈవిషయం రాజస్థాన్ పోలీసులకు కూడా బాగా తెలుసు. అందుకే వారు వెంటనే రాజ్‌గఢ్‌ జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు. వారు రంగంలోకి దిగి ఆభరణాల సంచితో రాజ్‌గఢ్‌ జిల్లాలోకి ప్రవేశించిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సంచిని స్వాధీనం చేసుకొని 24 గంటల్లోనే సదరు తెలంగాణ వ్యాపారికి అప్పగించారు.

ఈ నేపథ్యంలో కడియా సాంసీ, గుల్టేడీ, హులేడీ గ్రామాల నేపథ్యం గురించి పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. కడియా సాంసీ, గుల్ఖేడీ, హుల్ఖేడీ గ్రామాల సగటు జనాభా 5000 మాత్రమే. ఈ ఊళ్లకు చెందిన బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలపై దేశవ్యాప్తంగా దాదాపు 2వేల దాకా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ప్రత్యేకించి కడియా సాంసీ గ్రామంలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్నారట. గత ఆరు నెలల్లో ఈ ముఠాలకు చెందిన 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కడియా సాంసీ, గుల్ఖేడీ, హుల్ఖేడీ గ్రామాల్లోకి వెళ్లి పోలీసులు ఎవరినైనా అరెస్టు చేయడం అంత ఈజీ అయితే కాదు. అరెస్టు చేసే క్రమంలో గ్రామస్తులంతా పోలీసులపైకి తిరగబడతారు. ఓ కేసును విచారించే క్రమంలో ఇటీవలే తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ ఊరికి వచ్చిన పోలీసుల టీమ్‌పై ఇలాగే దాడి చేశారు.