ట్రంప్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని రద్దు చేసిన ఫెడరల్ కోర్టు

అమెరికాలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై ఫెడరల్ కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో వేలాది మంది ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయమూర్తి విలియం అల్సప్ కొట్టిపారేశారు. ఆ ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ‘‘ప్రభుత్వ వ్యయాల క్షీణతను సమర్థించుకునే పేరుతో సమర్థులైన ఉద్యోగులను సామూహికంగా తొలగించడం న్యాయసమ్మతం కాదు’’ అని అల్సప్ వ్యాఖ్యానించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన శాన్‌ఫ్రాన్సిస్కో యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అల్సప్, ట్రెజరీ, వెటరన్స్ అఫైర్స్, అగ్రికల్చర్, డిఫెన్స్, ఎనర్జీ, ఇంటీరియర్ శాఖల్లో అన్యాయంగా తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించాలని స్పష్టం చేశారు. పనితీరు పేరిట ఉత్తమమైన ఉద్యోగులను తొలగించడం అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్, ప్రభుత్వ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వేలాది ఉద్యోగులను తొలగించేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సమూలంగా మార్చే లక్ష్యంతో ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌)కి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ను అధిపతిగా నియమించారు.

ట్రంప్ మస్క్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఆయన సూచనలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపునకు మస్క్ చేసిన ప్రతిపాదనలపై ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, పలు ఫెడరల్ కోర్టులు ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిలిచి, స్టే విధించాయి. న్యాయమూర్తులు ఈ చర్యలను తప్పుబడుతున్నారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో మస్క్ మాట్లాడుతూ, ‘‘అమెరికా ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా మార్చే క్రమంలో ఈ చర్యలు తప్పనిసరి అని చెప్పారు. అయితే, మస్క్ జోక్యం ఎక్కువైందని, ట్రంప్‌ను ఆయన ప్రభావితం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే డోజ్ అనేక విభాగాల బడ్జెట్‌లో కోత విధించింది. విదేశాలకు యూఎస్ ఎయిడ్ ద్వారా అందించే సాయాన్ని కూడా నిలిపివేసి, పలు ఏజెన్సీలను మూసివేసింది. విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన స్వతంత్ర పరిశోధన సంస్థ నిధులను 100 కోట్ల డాలర్ల మేర తగ్గించేందుకు సిద్ధమైంది.