క్యాన్సర్ వచ్చిందంటే చాలు చాలామంది ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. ఫస్ట్ , సెకండ్ స్టేజ్‌లలో గుర్తించినపుడు మెడిసిన్, కీమో, రేడియేషన్ ద్వారా తగ్గించే ఛాన్స్ ఉంటుంది కానీ అదే నాలుగో స్టేజ్ అయితే మాత్రం పరిస్థితి చేయి దాటిపోయినట్లే అవుతుంది. అందుకే ప్రారంభంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దంటూ డాక్టర్లు పదే పదే చెబుతుంటారు. అయితే ఇకపై ఇలా భయపడే అవసరమే లేదంటున్నారు
ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్ మెంట్‌లో నిజంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. క్యాన్సర్ ను ఢీకొట్టే MRNA వ్యాక్సిన్ ను.. రష్యాలోని రీసెర్చ్ సంస్థలన్నీ కలిసి డెవలప్ చేశాయి. కొత్త సంవత్సరంలోనే దేశంలో అందరికీ ఈ వ్యాక్సిన్ ను ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చర్స్ చెప్పినదానిని బట్టి చూస్తే.. ఈ వ్యాక్సిన్ ను వచ్చే ఏడాది పూర్తి ఉచితంగానే ఇస్తారు.
ఈ వ్యాక్సిన్ శరీరంలో క్యాన్సర్ కణాలను వెంటనే గుర్తిస్తుంది. ఆ కణాలను ఢీకొట్టి వాటిన నాశనం చేసేలా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలంగా రెడీ చేస్తుంది. MRNA వ్యాక్సిన్ వేసుకున్నవారిలో క్యాన్సర్ కణతులుంటే వాటిని అభివృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంటూనే.. రోగ సంబంధ కణాల వ్యాప్తిని కూడా ఈ వ్యాక్సిన్ ఆపేస్తుంది. తాజాగా ఈ రెండు పనులను చేయడంలో ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ పనితీరు బాగుందని.. ఇప్పటికే అక్కడి క్లినికల్ ట్రయల్స్ లో నిరూపణ అయినట్లు కథనాలు వచ్చాయి.
ఇదే విషయాన్ని ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పారు. తాజాగా తాము క్యాన్సర్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నామంటూ పుతిన్ గర్వంగా చెప్పారు. అయితే ఇప్పటికీ ఈ వ్యాక్సిన్‌కు పేరు పెట్టలేదు.నిజానికి రష్యాలో 2022 సంవత్సరంలోనే ఆరు లక్షల 35 వేల కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి ఆ దేశంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరాన్ని గ్రహించిన రష్యా ప్రభుత్వం ఆ దిశగా చురుకుగా అడుగులు వేసింది. ఇది సక్సెస్ అయితే త్వరలో అన్ని దేశాలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
క్యాన్సర్ కు వ్యాక్సిన్లను తయారుచేయడానికి ఇప్పటకే చాలా దేశాలు సొంతంగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు టీకాలను ఇప్పటికే కొన్ని దేశాలలో అభివృద్ధి చేశారు.ముఖ్యంగా బ్రెయిన్ క్యాన్సర్ లో ఓ రకమైన గ్లియోబ్లాస్టోమాకు.. వ్యాక్సిన్ ను తయారు చేశారు. అలాగే చర్మ క్యాన్సర్ మెలనోమాకు యూకేలోనూ ఓ వ్యాక్సిన్ ను తయారుచేశారు. ఈ రెండిటికి అనుకున్న ఫలితాలు రావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.