ఆర్థిక మాంద్యంతో పాటు ఉద్యోగాల్లో నైపుణ్యాల కొరత వల్ల ప్రపంచ వ్యాప్తంగా టెక్ సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలవుతోంది. తాజాగా టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ లేఆఫ్స్ ఇప్పుడు భారత్‌ను కూడా తాకడంతో టెక్ రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో ముఖ్యంగా అడ్వర్‌టైజ్‌మెంట్లు, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ ప్రభావాన్ని ఎదుర్కోనున్నారు. దీనిలో భాగంగా..గూగుల్ భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వచ్చే వారం నుంచి ప్రారంభించే అవకాశమున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక అంచనా వేసింది. ప్రధానంగా ప్రకటనలు,సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులు ఈ లేఆఫ్స్ ఎఫెక్ట్ ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గూగుల్ ఈ విషయంపై అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ తాజా లేఆఫ్స్ ప్రకటనతో 2023లో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు.
గూగుల్ గత కొన్నేళ్లుగా అంతర్గత నిర్మాణంలో విస్తత మార్పులు చేస్తూ వస్తోంది. 2024లో గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ బృందాలను విలీనం చేయగా.. దీనిలో ఆండ్రాయిడ్, క్రోమ్, పిక్సెల్ హార్డ్‌వేర్ విభాగాలు సమన్వయించబడ్డాయి. ఈ విలీనం తర్వాత, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా కొంతమందిని తొలగించారు. అలాగే జనవరి 2025లో, గూగుల్ తన ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్ పథకాలను ప్రవేశపెట్టింది.
టెక్ రంగంలో కొనసాగుతున్న విస్తృత ట్రెండ్‌లో భాగంగా గూగుల్ లేఆఫ్స్‌ను చూడాల్సి వస్తుంది. 2023–2024లో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు.. వరల్డ్ వైడ్‌గా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం, 2024లో భారత ఐటీ రంగంలో 5–7% ఉద్యోగ కోతలు నమోదవడంతో లే ఆఫ్ ఎఫెక్ట్ భారత్‌లో ఎక్కువ ఉన్నట్లు అర్దం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.తాజాగా గూగుల్ లేఆఫ్స్ నిర్ణయం ఉద్యోగులలో ఒత్తిడిని, అనిశ్చితిని పెంచుతోంది. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది.