ఆపరేషన్‌ కగార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

2026 మార్చి నాటికి భారత దేశంలో నక్సలిజం అనే పదమే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల వేట కొనసాగిస్తూ వస్తోంది. గడిచిన 4 నెలలల్లో వందల మందిని ఎన్‌కౌంటర్‌ చేయించింది.అయితే ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై రాజకీయ పార్టీల నుంచి సామాన్యుల వరకూ వ్యతిరేకత పెరుగుతోంది. మావోయిస్టులు తాము చర్చలకు వస్తామని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా ఆపరేషన్‌ కొనసాగించడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఎల్కతుర్తి సభ వేదికగా జరిగిన బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆపరేషన్‌ కగార్‌పై సమావేశం నిర్వహించి కేంద్రానికి తమ శాంతి చర్చలపై విన్నపాన్ని తెలియజేశారు. మావోయిస్టుల భావజాలాన్ని చంపడమే పరిష్కారం కాదని.. ఈ అంశంపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని మీడియా ముందు కూడా చెప్పారు. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తూనే ఉంది.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్రం మావోయిస్టులపై దాడులు చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో పోలీసుల బాంబు దాడుల ద్వారా వందలాది మంది మావోయిస్టులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పాటు పలు పౌర హక్కుల సంఘాలు కూడా ఖండించాయి. ఈ ఆపరేషన్‌ మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోందని, సామాజిక సమస్యలను సైనిక చర్యలతో పరిష్కరించలేమని విశ్లేషకుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఆపరేషన్‌ కగార్‌లో నక్సలైట్లతో పాటు అమాయక పౌరులు, గిరిజనులు కూడా బలవుతున్నారంటూ పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలంటూ.. సామాజిక–ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా మావోయిస్టు ఉద్యమాన్ని నియంత్రించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.కేంద్రం ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. సీఎం రేవంత్ రెడ్డి.. ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమయినా జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగితే, శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అంతా భావిస్తున్నారు.