గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో భారీ మెజారిటీతో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిపోర్టేషన్ అంటే స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికాను వీడాలని, లేకపోతే రోజుకు దాదాపు 998 డాలర్లు అంటే 86వేల రూపాయల జరిమానాతో పాటు ఆస్తుల జప్తు, జైలు శిక్ష వంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.
అక్రమ వలసదారులను స్వీయ బహిష్కరణకు ప్రోత్సహించానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం .. CBP హోమ్ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకొని అమెరికాను వీడితే మంచిదని..లేకపోతే కఠిన చర్యలు తప్పవని చెబుతోంది. తనిఖీల్లో అక్రమవలసదారులు పట్టుబడితే వారు ఇప్పటి వరకూ సంపాదించిన ఆస్తులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. బహిష్కరణ ఆదేశాలను ఉల్లంఘించిన వారెవరయినా సరే అమెరికాకు తిరిగి రావడానికి అవకాశం కోల్పోతావరని తేల్చి చెబుతోంది. మొత్తంగా ఈ విధానం ద్వారా అక్రమ వలసదారుల్లో భయం కలిగించి, వారిని స్వచ్ఛందంగా అమెరికాను వీడేలా చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది.
నిజానికి ఈ జరిమానా విధానం ట్రంప్ ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చింది కాదు. 1996లో తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ చట్టంలో భాగమే. ట్రంప్ తన మొదటి పరిపాలనలో అంటే 2017-2021 ఈ చట్టాన్ని అమలు చేసి, తొమ్మిది మంది అక్రమ వలసదారులపై జరిమానాలను కూడా విధించారు. అయితే, కొన్ని కేసుల్లో ఈ జరిమానాలు నిలిపివేశారు. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ సర్కార్ ఈ జరిమానా విధానాన్ని నిలిపివేసింది. కాగా ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి రెడీ అయ్యారు.
అమెరికాలో సుమారు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరిలో చాలా మంది స్థానిక ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్నారు. వీరిలో చాలమంది వ్యవసాయం, నిర్మాణం, సేవా రంగాల్లో ఉన్నారు. అయితే ఈ భారీ జరిమానాలు, బహిష్కరణ భయం వల్ల వీరు ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. కాకపోతే దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు అమెరికా-ఇతర దేశాల మధ్య దౌత్య సంబంధాలపైన ఈ ప్రభావం పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.