ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు..జూన్ 21. అందుకే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జూన్ 21కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని 2014లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రధాన నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.
నరేంద్ర మోదీ ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలపడంతో.. 2015 జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన మొదటి యోగా దినోత్సవం వేడుకలకు ప్రధాని మోదీతో పాటు.. 84 దేశాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 35వేల 985 మంది సాధారణ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 35 నిమిషాల పాటు 21 యోగసనాలు వేయడంతో అప్పుడు రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఒకేసారి 35వేల985 మంది యోగసనాలు వేయడం ఒక రికార్డయితే, 84 దేశాలు యోగా కార్యక్రమంలో పాల్గొనడం మరో రికార్డు.
నిజానికి యోగా చరిత్ర చాలా ప్రాచీనమైనదనే చెబుతారు. ఎందుకంటే సింధు నాగరికత కాలంలో కూడా యోగా ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు కూడా శారీరక ధారుడ్యం కోసం కొన్ని ఆసనాలు వేసేవారు. అయితే పతంజలి వాటన్నింటినీ ఓ చోట చేర్చి యోగాకు ఓ రూపునివ్వడంతో.. పతంజలిని యోగా పితామహుడిగా అభివర్ణిస్తారు.
యోగ అనేది మనసులోని చంచలత్వాన్ని అడ్డుకుని, మనసును స్థిరంగా ఉంచి సుఖాన్ని ఇచ్చే క్రియ. పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో.. శరీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగనిరోధక శక్తికి ఆచరించే ప్రక్రియలను వివరించారు. అయితే ఈ మోడర్న్ యుగంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది మాత్రం బి.కె.ఎస్.అయ్యంగార్. అయ్యంగార్ కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని చెప్పొచ్చు.దీనిపై ఆయన శోధించి ఎన్నో గ్రంధాలు రచించారు.
అయితే యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో సెలబ్రెటీలు సైతం ఇప్పుడు యోగాపై మక్కువ పెంచుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరికి తగినట్లు వారికి యోగాసనాలు ఉండటంతో యోగా మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఒబెసిటీకి యోగాని మించింది లేదని ఎంతో మంది ప్రూవ్ చేశారు. అందుకే రోజురోజుకు యోగాపై అవగాహన పెంచుకున్న ఎంతోమంది ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోవడానికి కూడా యోగాను ఆశ్రయిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY