ఆర్జీకర్ ఆసుపత్రిలో భద్రత పెంపు

Increased security at RG Kar Hospital

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. అయితే అందులో ప్రధానంగా పోలీసులు FIR నమోదు చేసి తీరే అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం రాత్రి 11 గంటలకు వాళ్లకి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంటి నుంచి హాస్పిటల్‌కి చేరుకునే సరికి అర్ధరాత్రి 12 అయింది. ఆత్మహత్య చేసుకుందని చెప్పి అక్కడే కూర్చోబెట్టారు. దాదాపు మూడు గంటల తరవాత డెడ్‌బాడీని చూసేందుకు అనుమతినిచ్చారు. బాధితురాలి తండ్రి లోపలికి వెళ్లి తన కూతురి మృతదేహాన్ని చూసి డెడ్‌బాడీని గుర్తించారు. ఆ తరవాత వెంటనే పోలీసులు FIR నమోదు చేయాల్సింది. కానీ ఆ ఊసే లేదు. తండ్రి ఫిర్యాదు చేస్తే తప్ప FIR నమోదు చేయకపోవడమూ అనుమానాలకు దారి తీస్తోంది.

సుప్రీంకోర్టు కూడా ఇదే విషయమై పోలీసులను తీవ్రంగా మందలిచింది. తల్లిదండ్రులు వచ్చి కంప్లెయింట్ ఇచ్చే వరకూ ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసులలో పోలీసులు సుమోటోగా FIR నమోదు చేసే అవకాశముందని క్రిమినల్ లాయర్స్ చెబుతున్నారు. అయినా ఈ కేసులో అది హత్య అని చెప్పడానికి అన్ని ఆధారాలూ ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. తాము కంప్లెయింట్ చేశాక గంటకి కేసు నమోదు చేశారని, అసలు ఇంత ఆలస్యం ఎందుకు చేశారో పోలీసులకే తెలియాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ధ్వంసం చేస్తున్న వారు అడ్డుకోవడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాగే వైద్యుల భద్రతకు CISF నియమించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హూం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) చర్యలు చేపట్టింది. డాక్టర్ హాస్టలు కూడా CISF బలగాలు భద్రత కల్పిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా అత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే వైద్యులు మరియు ఇతర నిపుణుల భద్రత కోసం నియమాలను రూపొందించడానికి సుప్రీంకోర్టు 10 మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్బ్స్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను సమర్పించాల్సి ఉంది. తుది నివేదిక సమర్పణకు రెండు నెలల గడువు ఇచ్చారు.