జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనతో.. భారత ప్రభుత్వం దాయాది దేశం పాకిస్తాన్‌కు వరుసగా షాక్‌లు ఇస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను దెబ్బతీయడానికి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకున్న భారత్.. మరోవైపు ఉగ్రవాదుల కోసం గాలింపు విస్తృతం చేసింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసి పెద్ద షాక్ ఇచ్చిన భారత్ తర్వాత పాకిస్తానీలకు వీసాలు రద్దు చేసింది. తాజాగా పాక్ కేంద్రంగా నడుస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది.
పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న 16 యూట్యూబ్ చానెళ్లను భారత్ బ్యాన్ చేసింది. కాగా ఈ చానెళ్ల జాబితాలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అంతేకాదు వీరితో పాటు ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొన్న బీబీసీ చానళ్లకు కూడా కేంద్రం నోటీసులు జారీ చేసింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో..భారత్ తీసుకుంటున్న ఇలాంటి చర్యలు జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సులతో.. పాకిస్తాన్ నుంచి నిర్వహించబడుతున్న 16 యూట్యూబ్ చానల్స్ పై భారత్‌లో నిషేధాన్ని విధించారు. ఈ ఛానల్స్‌లో డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ వంటి ప్రముఖ మీడియాలతోపాటు కొందరి వ్యక్తిగత చానళ్లు కూడా ఉన్నాయి. ఈ చానల్స్‌లో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన .. రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన, సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నిషేధం జాతీయ భద్రతను కాపాడటానికి తీసుకున్న చర్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..
ఈ 16 చానల్స్‌లో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చానల్ కూడా ఉంది. అక్తర్ తన చానల్‌లో క్రీడలకు సంబంధించిన కంటెంట్‌తోపాటు, భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు ఉండటం, అలాగే రాజకీయ అంశాలపైన కూడా చర్చలు ఉండటమే ఈ నిషేధానికి కారణంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాగే
పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా బీబీసీ చానల్స్ ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో బీబీసీ కథనాలు భారతీయుల భావోద్వేగాలను గాయపరిచినట్లు, ఉగ్రవాదాన్ని సమర్థించే విధంగా ఉన్నట్లు ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసింది.