భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్లో నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ ఆర్మీ చొరబాటుకు పాల్పడింది. ఈ ఘటనలో మందుపాతర పేలడంతో పాటు, పాక్ సైన్యం కాల్పులు జరిపింది. దీనికి భారత దళాలు సముచిత బదులు ఇచ్చి ప్రతీకార దాడులు నిర్వహించాయి. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారని సమాచారం. చనిపోయిన పాక్ సైనికులను చారికోట్ హవేలికి చెందిన చౌదరి నజాకత్ అలీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నాక్యాల్ కోట్లికి చెందిన నసీర్ అహ్మద్‌గా గుర్తించారు. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1.30 గంటలకు చోటుచేసుకుంది.
భారత సైన్యపు వర్గాల ప్రకారం, ఈ చర్య ద్వారా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జమ్మూకు చెందిన రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బార్త్వాల్ వెల్లడించారు. 2021లో భారత్, పాక్ సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య సరిహద్దు వెంబడి శాంతి కాపాడే ఒప్పందం కుదిరినప్పటికీ, పాక్ తరచూ ఉల్లంఘనలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇక జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భారత సైన్యం ముమ్మరంగా ఉగ్రవాదుల ఎదుపై ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, భారత భద్రతా దళాలు ఇప్పటివరకు ఇద్దరు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చాయి. అలాగే, సరిహద్దు జిల్లాలోని పంజ్‌తిర్తి ప్రాంతంలో దాక్కున్న మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఏడాది జనవరి నుంచే పాకిస్తాన్ ఎల్ఓసీ వద్ద శాంతిని భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 12న రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్లో పాక్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు. ఫిబ్రవరి 11న జమ్మూ ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదుల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) దాడిలో కెప్టెన్ కరమ్‌జిత్ సింగ్ బక్షి సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఎల్ఓసీ వెంబడి జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడ్డారు. ఫిబ్రవరి మొదటి వారంలో పూంచ్‌లో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుళ్లలో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ, పాక్ చొరబాట్లను సమర్థంగా ఎదుర్కొంటుంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి సన్నాహాల్లో కొనసాగుతుండగా, భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఎలా ఉంటాయో వేచిచూడాలి.