రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఆగస్టు 12 వరకు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Indian Railways Extends Cancellation of All Regular Train Services till August 12

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ వంటి టైం టేబుల్‌ ఆధారిత రెగ్యులర్‌ ప్రయాణికుల రైలు సర్వీసులను ఆగస్టు 12 వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఈ రైళ్ళ సర్వీసులను జూన్ 30 వరకు రద్దు చేయగా, ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 12 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే దేశంలో వలస కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు, మే 12 నుంచి ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల రాజధాని మార్గాల్లో నడిచే 30 ప్రత్యేక రైళ్లు, అలాగే జూన్‌ 1 నుంచి నడుస్తున్న 200 స్పెషల్ రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది. తాజా పాసెంజర్ రైళ్ల రద్దు నిర్ణయంతో జూలై 1 నుంచి ఆగస్టు 12 మధ్య బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని, వారికీ టికెట్ డబ్బులను వాపసు చేయనున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. మరోవైపు కరోనా నియంత్రణలో భాగమైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లను ఇకపై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే స్టాళ్లలో కూడా విక్రయించనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu