ఐపీఎల్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో ఒక ఆటగాడికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ క్యాపిటల్స్ మానేజ్మెంట్ జట్టులోని అందరు ఆటగాళ్లకు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు, గత వారంలో జట్టు యొక్క ఫిజియో పాట్రిక్ ఫర్‌హార్ట్ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉండి, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా టీమ్ లోని మరో ఆటగాడికి కరోనా సోకిన నేపథ్యంలో తదుపరి మ్యాచ్ కోసం జట్టు షెడ్యూల్ చేసిన పూణే ప్రయాణాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం టీమ్ లోని ఆటగాళ్ళందరికి టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే జట్టులోని ఆటగాళ్లతో పాటు ఇతర సహాయక సిబ్బంది అందరిని ఎవరి గదుల్లో వారే ఉండేలా ఐసోలేషన్‌లో ఉంచారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) దీనిపై దృష్టి సారించింది. ఇతర జట్ల మధ్య వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఒక ప్రణాళికను రూపొందించే ప్రక్రియలో ఉందని బోర్డులోని వర్గాలు సూచించాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో ఆ ఆటగాడికి పాజిటివ్ వచ్చిందని, అయితే తుది నిర్ధారణ కోసం ఈసారి RT-PCR టెస్ట్ నిర్వహించనున్నామని జట్టు యాజమాన్యం తెలిపింది. క్యాపిటల్స్ తన చివరి గ్రూప్ లీగ్ మ్యాచ్‌ను శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడింది. దీంతో ఐపీఎల్ లోని ఇతర జట్లు కూడా ఆందోళనలో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ మ్యాచ్ జరిగేది అనుమానంగా ఉంది. దీనిపై బిసిసిఐ ఈరోజు, రేపట్లో నిర్ణయం తీసుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ