ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇట్స్ రివెంజ్ టైమ్ అన్నట్లుగా భారత్.. మిలటరీ ఆప్షన్స్‌ను పక్కన పెట్టి ముందుగా సింధు అస్త్రాన్ని పాక్‌పై ప్రయోగించింది. నిజానికి పాకిస్తాన్‌ను పరోక్షంగా భారీ దెబ్బే కొట్టింది భారత దేశం. సింధునదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంటుందని పాక్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో దిక్కుతోచని పాక్…ఇండియాపై సిమ్లా అస్త్రాన్ని ప్రయోగించింది.
సింధు నది, దాని ఉప నదులు రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, జీలం..భారత దేశం గుండా పాకిస్తాన్ కు వెళతాయి. పాకిస్తాన్‌కి సింధు నది జీవనాడి ఎందుకంటే.. సాగు, తాగునీటికి కూడా సింధు నదే ఆ దేశానికి ఆధారం. ఈ నీళ్ల బంద్‌తో పాక్‌లో 90శాతం ఆయకట్టుకు కటకట తప్పదన్న విషయంతో పాక్ వణికిపోతోంది. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలకు గొంతెండి పోవడంతో పాటు… పాక్ జీడీపీలో 23 శాతం పైగా ఉన్న వ్యవసాయ రంగం కుదేలవక తప్పదు. దీంతో పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమన్న విషయం వారికి ఎటూ పాలుపోనీవడంలేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత దేశం రద్దు చేయడంతో…దానికి ప్రతీకారంగా సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది . నో మోర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ రంకెలు వేస్తోంది. భారత్‌తో తమకు హద్దుల్లేవు, సరిహద్దుల్లేవు అంటూ మండిపడుతోంది.
1971లో భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. 1972లో రెండు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం, 1971 డిసెంబర్ 17 వ తేదీ నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నాటి నుంచి నియంత్రణ రేఖగా మార్చారు. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా, రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేదే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందం వల్ల చివరకు ఐక్యరాజ్య సమితి కూడా కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేయడం ద్వారా, కశ్మీర్ అంశాన్ని ప్రపంచం ముందు పెట్టొచ్చని, ఇకపై నానా యాగీ చేయొచ్చని పాకిస్తాన్ పన్నాగం పన్నుతోంది. దీనికితోడు LOC లేకపోవడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం అవుతుందని పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది
అయితే ఇక్కడే ఆవేశంలో ఉన్న పాకిస్తాన్ చిన్న విషయాన్ని మరిచిపోయిందని నిపుణులు అంటున్నారు. పాక్ చెబుతున్నట్లు సిమ్లా ఒప్పందం రద్దయితే అది భారత దేశానికి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే పీవోకేని తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి భారత దేశానికి అవకాశం దొరికినట్టే అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయిందని .. భారత్ పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించడంతోనే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ తన గొయ్యి తానే తవ్వుకుంటుందని చెబుతున్నారు.