అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవడంతో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధికారాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా తన కేబినెట్‌లో ఉండే మంత్రులను ఎంపిక చేసిన ట్రంప్..తమ విధేయులకు పదవులు అప్పగించారు. అలాగే సమర్థద ఆధారంగా కూడా వైట్‌హౌస్ కార్యవర్గంలో పదవులతో పాటు పలు కీలక పదవులకు కట్టబెట్టేందుక అధికారులను కూడా ఎంపిక చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా 2025, జనవరి 20 వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సమయంలో అమెరికా అధికార మార్పిడికి సిద్ధమవుతోండగా..ఆర్థిక ప్రతిష్టంభన తలెత్తింది. క్రిస్మస్ సమయంలో షట్‌డౌన్ ముప్పును తప్పించడానికి ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్‌ను .త్వరలో అధ్యక్షుడుగా రానున్న ట్రంప్ తిరస్కరించారు. అయితే దీనిపై కనీసం చర్చ అయినా జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్ సభ్యులకు సూచించినా ఫలితం లేదు. ఫెడరల్ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న ఈ సమయంలో.. ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇక డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడయిన ఎలాన్ మస్క్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బైడెన్ సర్కార్ తీసుకువచ్చిన నిధుల ప్లాన్‌తో భారీగా ఖర్చులు పెరిగాయని మస్క్ భావిస్తున్నారు.దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. 1500 పేజీల బిల్లు తాజాగా బయటకు రాగానే టెస్లా అధినేత మస్క్ దీనిపై స్పందిస్తూ..దీనిని ఆమోదించకూడదంటూ ట్వీట్ చేశారు. ఈ బిల్లుకు మద్దతుగా ఓటువేసే సభ్యులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పరోక్షంగా మస్క్ హెచ్చరించారు. కాగా మస్క్ ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ రిపబ్లికన్ నేతలకు తన అల్టిమేటాన్ని జారీ చేయడం విశేషం.
అమెరికాలోని ప్రభుత్వ కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు డిసెంబర్ 20 నాటికి ఆమోదం లభించాలి. కానీ, డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఈ ప్రకటనను విడుదల చేశారు. రిపబ్లికన్లు చాలా తెలివైనవారని పేర్కొన్న ట్రంప్.. ఈ బిల్లును ఆమోదించకూడదని సూచించారు. అయితే దీనిపై చర్చ చేపట్టాల్సిందేనంటూ స్పీకర్ మైక్ జాన్సన్, ఇతర రిపబ్లికన్లకు సూచించారు. అలాగే దీంతోపాటు ఇతర డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చినట్లు తెలిస్తోంది. కానీ, వారు ఎటువంటి ఆమోదం తెలుపకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది.
తాజాగా తెచ్చిన ఆర్థిక ప్రణాళికలో హరికేన్ బాధిత రాష్ట్రాల కోసం, ఇతర ప్రకృతి విపత్తుల బాధితుల కోసం 100.4 బిలియన్ డాలర్ల విపత్తు సహాయ నిధి కింద కేటాయించారు. అయితే తాజా పరిణామాలపై డెమోక్రాట్ల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ స్తంభించి పోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. అదే కనుక జరిగితే యావత్ అమెరికన్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని డెమోక్రాట్లు హెచ్చరిస్తున్నారు.