ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని భద్రతా దళాలు ఈరోజు (శుక్రవారం) కూల్చివేశాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఉగ్రవాది నివాసాన్ని ధ్వంసం చేయడానికి భద్రతా బలగాలు నియంత్రిత పేలుడు పదార్థాలు (IEDs) ఉపయోగించాయి.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. పేలుడు పదార్థాలను దాచిపెట్టి, ఉగ్ర కార్యకలాపాలకు ఈ ఇంటిని ఉమర్ నబీ అడ్డాగా వాడుకున్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
భద్రతా దళాల ఈ చర్య ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక పంపే ఉద్దేశంతో జరిగింది. ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి, సహకరించే వారికి ఇలాంటి శిక్షే తప్పదని, భారత భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు ఎటువంటి చోటు లేదన్న గట్టి సంకేతాన్ని దేశానికి, అంతర్జాతీయ సమాజానికి వినిపించారు. ఇదివరకు కూడా కశ్మీర్‌లో ఉగ్రదాడి కుట్రల్లో పాల్గొన్న వారి ఇళ్లను కూల్చివేసిన ఉదంతాలు ఉన్నాయి.
ఢిల్లీ ఘటన వివరాలు..
ఎర్రకోట సమీపంలోని నేతాజీ సుభాష్ మార్గ్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉమర్ నబీ హ్యుందాయ్ ఐ20 కారుతో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 13 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తర్వాత లభించిన శరీర భాగాల డీఎన్ఏ శాంపిల్స్ ద్వారా ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఉమర్ నబీనే అని ధృవీకరించారు. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేసిన ఉమర్ నబీ, తన సహచరులు అరెస్ట్ కావడంతో భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.







































