స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ జోరుకు బ్రేక్ వేసేందుకు కమల వ్యూహం..

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం కొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. రేపు జరిగే ఓటింగ్ కోసం ఓటర్లు సిద్దమవుతుండగా.. చివరి నిమిషంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేర్లు. వీళ్లిద్దరిలో ఎవరు అమెరికా అధ్యక్షుడు అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి రిపబ్లికన్ అయిన ట్రంప్, డెమొక్రటిక్ అయిన కమలా.. ఇద్దరికీ రేసులో పెద్దగా తేడా లేదు. ఇద్దరూ గట్టిపోటీయే ఇస్తున్నారు. ట్రంప్ దూకుడుతనం ఆయనకు ప్లస్ అవుతోంది.

కమలా హారిస్ లేడీ కావడం, గత నాలుగేళ్లలో ఆమె ఉపాధ్యక్షురాలిగా బాగానే పనిచేయడం వంటి అంశాలు ఆమెకు ప్లస్ అవుతున్నాయి. స్వింగ్ స్టేట్స్‌లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో, దాన్నిబట్టీ.. ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్వింగ్ స్టేట్ అయిన అరిజోనాలో ట్రంప్ ముందున్నారు. నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, జార్డియాలో కమలా హారిస్ ముందున్నారు. పెన్సిల్వేనియా, మిచిగాన్‌లో నువ్వా నేనా అన్నట్లు ఉంది. నెవాడా, విస్కాన్సిన్, జార్డియాలో ఇదివరకు ట్రంప్‌కి ఎడ్జ్ ఉంది.

కాగా డెమోక్రాట్ల అభ్యర్ధి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎంచుకున్న ఓ వ్యూహం ప్రస్తుతం ఓటర్లలో చర్చనీయాంశమవుతోంది. హోరాహోరీ పోరులో బయటపడేందుకు కమల వ్యూహాలకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. మహిళా సెంటిమెంట్ ను ఆమె బలంగా నమ్ముకున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రంప్ తో హోరాహోరీ పోరులో గట్టెక్కాలంటే ఆర్దిక విధానాలు, భద్రత, వలసల నియంత్రణ వంటి అంశాలతో పాటు మహిళా సెంటిమెంట్ ను కూడా ప్రయోగించక తప్పడం లేదని తెలుస్తోంది. దీంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన దంపతుల్లో భార్య మహిళా అభ్యర్ధిని ఎంచుకుంటున్నట్లుగా ఓ యాడ్ తయారు చేశారు. ఇలాంటి అర్ధం వచ్చేలా మరికొన్ని యాడ్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై ట్రంప్ మద్దతుదారులు మండిపడుతున్నారు.

ఇక అమెరికాలో ఆన్‌లైన్ ఓటింగ్ ఉండటం వల్ల వారం నుంచి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే 4 కోట్లమంది ఓటు వేశారు. ఐతే.. భారతీయులవైపు నుంచి చూస్తే.. ఎక్కువ మంది కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నారు. కానీ.. ఇక్కడో కీలక పాయింట్ ఉంది. కమలా హారిస్ భారత సంతతి మహిళే కావచ్చు గానీ.. ఆమెకు భారత్ పట్ల ప్రత్యేక అభిమానం ఉండే అవకాశాలు తక్కువే. గత నాలుగేళ్లలో ఆమె ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు. కాకపోతే.. ప్రధాని మోదీ లాంటి వారు అమెరికాకి వెళ్లినప్పుడు ఆమె ఆతిథ్యం ఇచ్చారు. ఐతే.. ఉపాధ్యక్షురాలు కాబట్టి.. అలా ఇవ్వడం సహజం. అంతే తప్ప భారత్ పట్ల ఆమె ప్రత్యేక ఆసక్తి ఏదీ కనబరచలేదు.