దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి ముగియడంతో ఇక అందరి చూపు కౌంటింగ్ మీదే పడింది. ఫిబ్రవరి 8 న ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుందెవరంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత రెండు సార్లు కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచే ఆ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలను రూపొందించి.. వాటి ద్వారా విజయవంతమయింది. ఢిల్లీలో అధికారంలో ఉంటూనే పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చింది.
అంతేకాదు హర్యానాలో సీఎం పీఠాన్ని దక్కించుకుంటామని , గుజరాత్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పింది..కాకపోతే అవేవీ వాస్తవరూపం దాల్చకపోవడంతో.. ఢిల్లీ, పంజాబ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఎన్నికలు పూర్తయిన వెంటనే అనేక సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. చాలా సర్వేలు ఈసారి ఆప్ అధికారానికి దూరమవుతుందనే చెప్పాయి. అయితే ఈ సర్వేల కంటే భిన్నంగా కేకే సర్వే మాత్రం ఢిల్లీ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కుతుందని చెప్పడం హాట్ టాపిక్ అయింది.
కేకే సర్వే లో..70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో 39 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని..బీజేపీకి 22 స్థానాలు వస్తాయని చెప్పింది. అయితే ఈ నెల 8న ఢిల్లీ ఫలితాలు విడుదలవుతుండటంతో అందరి దృష్టీ కేకే సర్వే పైనే పడింది . ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. ఒక్క హర్యానాలో మాత్రమే విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి.
ఢిల్లీ లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు.. కేకే సర్వే మినహా మిగతా అన్ని సంస్థలు కూడా ఆప్ కు వ్యతిరేకంగా.. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. కాకపోతే కేకే సర్వే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా ఉంది. యువత, మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేసినట్లు కేకే సర్వే చెబుతుంది. ఇప్పుడు అన్ని సర్వే సంస్థలు ఒకటి చెబుతుంటే వీటన్నిటిని కాదని కేకే సర్వే ఢిల్లీ పీఠం ఆప్ దక్కించుకుంటుందని చెప్పడంతో ఢిల్లీ వాసులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.