తాజాగా వయనాడ్‌లో జరిగిన ప్రకృతి విలయతాండవంతో..కొన్నేళ్లుగా దేవభూమి కేరళపై ప్రకృతి పగ పట్టినట్టు కనిపిస్తుందన్న వాదన మరోసారి తెరమీదకు వస్తోంది. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో కేరళ రాష్ట్రం ప్రతి ఏటా విలవిలలాడటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నిజమే ఒకప్పుడు దేవభూమి కేరళ అనుకునే వారంతా ఇప్పుడు కేరళ పేరెత్తితేనే వణికిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ క్షణాల ఏ విపత్తులో చిక్కుకుంటామోనని ప్రాణాలు బిక్కుబిక్కుమని పెట్టుకునే రోజులు వస్తున్నాయి. చివరకు కేరళలో ప్రతి ఏడాదీ ఇలాంటి సీన్లు వెరీ కామన్ అన్న స్థితికి అంతా వచ్చేశారు.
కేరళలో ప్రతీ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో పదుల, వందల సంఖ్యలో మరణిస్తున్నారు. 2018లో సంభవించిన విధ్వంసక వరదల్లో అయితే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 483 మంది మృత్యువాత పడ్డారు. అసలు కేరళలో ప్రతీ ఏడాది ఇలా ఎందుకు జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం వ్యక్తం అవుతోంది.
తాజాగా కేరళపై ప్రకృతి విపత్తులకు గల కారణాలను నిపుణులు వెల్లడించారు. కేరళలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంటుందని, కేరళలోని 14.5% భూభాగం దీనికి దుర్భలంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. పర్యావరణ మార్పులు, అటవీ నిర్మూలన వంటివి..ముఖ్యంగా వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణాలవుతున్నాయని నిపుణులు అంటున్నారు. వరద, కొండచరియలు విరిగిపడే ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలు కూడా ప్రకృతి విపత్తులకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కేరళలోనే అధిక సంఖ్యలో కొండ చరియలు విరిగిపడే ఘటనలు చోటుచేసుకొంటున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ గతంలోనే పార్లమెంట్లో వెల్లడించింది. 2015-22 మధ్య 3,782 ఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 2,239(59.2%) ఒక్క కేరళ రాష్ట్రంలోనే జరిగినట్లు తెలిపింది. మొత్తం 1,848 చదరపు కిలోమీటర్లు అంటే రాష్ట్రం విస్తీర్ణంలో 4.75%.. ‘హై ల్యాండ్ స్లెడ్ హజార్డ్ జోన్’గా కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ కూడా గుర్తించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కూడా కేరళలోనే ఉంటున్నట్లు తెలిపింది.
గతంలో చోటుచేసుకున్న కొండచరియల విపత్తులు
1.కేదార్నాథ్, ఉత్తరాఖండ్(2013)
2013 జూన్‌లో కుంభవృష్టి వల్ల ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదలు పోటెత్తాయి. పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ విపత్తులో.. ఏకంగా 5 వేల మందికి పైగా మరణించడం అప్పట్లో సంచలనం రేపింది.
2.మాలిన్, మహారాష్ట్ర(2014)
మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో 2014లో కొండచరియలు విరిగిపడి 151 మంది మరణించారు.
3.షిల్లాంగ్, మేఘాలయ(2011)
మేఘాలయలోని షిల్లాంగ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20 మంది మరణించారు.
4.కేరళ,2018
దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో 2018 లో వరదలు సంభవించడంతో..483మంది ప్రాణాలు కోల్పోయారు. 4 జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో..సుమారు 85,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు.
5.కొట్టాయం, కేరళ(2019)
కేరళలోని కొట్టాయం జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
6.మణిపూర్(2022)
భారీ వర్షాలతో మణిపూర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 40 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF