దేశవ్యాప్తంగా వైద్య విద్యాకోర్సుల్లో ఎంట్రన్స్ కోసం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతియేటా NEET ఎగ్జామ్ నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి నీట్ పరీక్షలో మార్పులు తీసుకు రావడానికి రంగం సిద్ధమౌతోంది. జేఈఈ లాగే నీట్ ఎగ్జామ్‌ను కూడా రెండంచెల్లో నిర్వహించాలని రాథాకృష్ణన్ కమిటీ సిఫారసు చేయగా.. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
నీట్ పరీక్షతో పాటు ఇతర జాతీయ ప్రవేశ పరీక్షల్లో కూడా ఇలాంటి కీలక మార్పులు రావచ్చు. ముఖ్యంగా నీట్ పరీక్షపై జరుగుతున్న వివాదాలవల్ల విద్యార్ధుల్లో చాలా ఆందోళన నెలకొంటుంది. ఈ ఏడాది అయితే ఏకంగా నాలుగు సార్లు ఫలితాలు ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో నీట్‌తో పాటు ఇతర జాతీయ పరీక్షల విధానంలో మార్పులు చేర్పుల కోసం కేంద్ర ప్రభుత్వం.. ఇస్రో మాజీ ఛీఫ్ రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో కమిటీ వేయగా.. ఈ కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది.
ఈ కమిటీ నివేదిక ప్రకారం నీట్ యూజీ పరీక్షలో ఇకపై మార్పులు తప్పవని తెలుస్తోంది. పరిమితమైన మెడిసిన్ సీట్ల కోసం 25 లక్షలమంది పోటీ పడుతుండటంతో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. అందుకే నీట్‌లో కూడా జేఈఈ తరహాలోనే రెండంచెల పరీక్షను ప్రవేశపెట్టాలని రాథాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసింది. అంటే మొదటి దశలో జేఈఈ మెయిన్స్ లా స్క్రీనింగ్ పరీక్షగా ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తేనే రెండవ దశ రాయడానికి వీలుంటుంది. దీనివల్ల విద్యార్ధులలో భారీగా ఫిల్టర్ జరుగుతుంది కాబట్టి.. ఫలితంగా రెండవ దశలో పరీక్షా కేంద్రాలపై భారం కూడా తగ్గుతుందని కమిటీ సూచించింది.
పేపర్ లీకేజ్ వ్యవహారం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టడానికి రాధాకృష్ణన్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. దశలవారీగా ఆన్‌లైన్ పరీక్షకు మారాలని తెలిపింది. పూర్తిగా ఆన్ లైన్ పరీక్షకు సాధ్యం కాకపోతే.. హైబ్రిడ్ మోడల్ సిపారసు చేసింది. అంటే ప్రశ్నాపత్రాలు డిజిటల్ రూపంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లగా.. విద్యార్ధులు పేపర్‌పై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేపర్ లీకేజ్ అరికట్టవచ్చని కమిటీ అభిప్రాయపడింది.