దేశవ్యాప్తంగా లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల (One Nation, One Election) బిల్లులు మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబడ్డాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 269 మంది ఎన్డీయే ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది విపక్ష సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు.
విపక్షాల విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి మాట్లాడుతూ ఈ బిల్లులు ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ ఈ బిల్లులు దేశాన్ని నియంతృత్వ పాలన వైపు నడిపిస్తాయని హెచ్చరించారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ జమిలి ఎన్నికలను ప్రజాస్వామ్యానికి వైరస్ అని అభివర్ణించారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలపై ఇది ప్రభావం చూపుతుందని అన్నారు.
ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం బిల్లును సమర్థిస్తున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల ఖర్చులు తగ్గుతాయని, అభివృద్ధి పనుల్లో అటంకాలు తొలగుతాయని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే విపక్షాలు సంస్కరణలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
జమిలి ఎన్నికల ప్రణాళిక కొత్తదేమీ కాదని అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పష్టంచేశారు. 1983 నుంచి ఈ విధానానికి డిమాండ్ ఉందని, స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లో ఇలాంటి ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్రం జమిలి ఎన్నికలకు జనాభా లెక్కల సేకరణ (2025) మరియు నియోజకవర్గాల పునర్విభజన (2027) వంటి కీలక కార్యక్రమాల ద్వారా అడ్డంకులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ బిల్లుల చర్చ దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠను పెంచింది. ప్రతిపక్షాలు రాజ్యాంగ వ్యవస్థపై హాని కలిగిస్తుందని ఆరోపిస్తుండగా, కేంద్రం మాత్రం దీనిని ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచే మార్గంగా చూపిస్తోంది. 2029లో జమిలి ఎన్నికల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించడంతో, ఈ బిల్లులు భారత రాజకీయంలో కీలక మలుపు తీసుకురానున్నాయి.