మూడు రోజుల క్రితం భారీ భూకంపం విలయతాండవం చేయడంతో..భారత్ పొరుగు దేశమైన మయన్మార్ చిగురుటాకులా వణికింది. భూకంప ప్రభావంతో తీవ్ర నష్టం జరిగింది. 2 వేల మంది వరకు మృతిచెందగా..వేలాదిమంది ఆచూకి తెలియకుండా పోయింది. భారీ భవనాలు, ఛారిత్రక కట్టడాలు, గుడులు, గోపురాలు, బ్రిడ్జిలు, అత్యాధునిక నిర్మాణాలు ఎన్నో కళ్లముందే క్షణాల్లో నేలమట్టమయ్యాయి. ఈ వార్త తెలిసిన వెంటనే.. భారత్ తన వంతుగా మొదటగా స్పందించి.. తక్షణమే సాయాన్ని అందించింది.
ఈ విపత్తుకు ప్రపంచవ్యాప్తంగా సాయం వెల్లువెత్తుతుండగా.. తొలి స్పందనగా భారత్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ బ్రహ్మ పేరుతో.. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన భారత్, బాధితులకు తక్షణ ఉపశమనం కల్గించడానికి శరవేగంగా రంగంలోకి దిగింది. ఇప్పటికే 15 టన్నుల సహాయక సామగ్రిని ఆదివారం తెల్లవారుజామున సైనిక విమానాల ద్వారా మయన్మార్‌కు పంపింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, బ్లాంకెట్లు, ఎమర్జెన్సీ మెడిసిన్, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ లైట్లు, జెనరేటర్లు వంటివి ఈ సామగ్రిలో ఉన్నాయి.
అలాగే 118 మంది వైద్య, సాంకేతిక సిబ్బందితో కూడిన ఫీల్డ్ ఆస్పత్రిని కూడా మయన్మార్‌కు పంపించింది. ఈ బృందం మాండలే ప్రాంతంలో గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తోంది. కాగా మరో రెండు వాయుసేన విమానాల్లో అదనపు సామగ్రి, ఐఎన్‌ఎస్ సావిత్రి , అలాగే ఐఎన్‌ఎస్ సాత్పురా నౌకల్లో 40 టన్నుల సామగ్రిని యాంగూన్‌కు పంపుతున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సభ్యులు, రెస్క్యూ డాగ్స్, ఆరు అంబులెన్సులతో కమాండెంట్ పి.కె. తివారీ నేతృత్వంలో.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మొదలుపెట్టారు. భారత్–మయన్మార్ మధ్య 1,643 కిలోమీటర్లు సరిహద్దు ఉండటం వల్ల ఈ సాయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ సహాయానికి ‘బ్రహ్మ’ అనే పేరు వెనుక ఉద్దేశాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ వివరించారు. విధ్వంసం జరిగిన మయన్మార్లో మౌలిక సదుపాయాలను త్వరగా పునరుద్ధరించాలని భారతదేశం కోరుకుంటోంది. అందుకే ఈ ఆపరేషన్‌కు బ్రహ్మ అని నామకరణం చేశామని వివరించారు.