నెల రోజుల్లో వెయ్యి మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు

TOPSHOT - US President Donald Trump looks on after signing an executive order in the Oval Office of the White House on April 9, 2025 in Washington, DC. (Photo by SAUL LOEB / AFP)

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక..వలసదారులను అమెరికా నుంచి బయటకు వెళ్లడమే టార్గెట్ పెట్టుకుని రకరకాల కండిషన్లతో ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా విదేశీ విద్యార్థులపైన కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన కొన్ని వారాల్లోనే వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాను లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ యంత్రాంగం తీరుపై షాక్ తిన్న చాలామంది విద్యార్థులు ఇప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీసా రద్దు చేసే విధానంలో ఫెడరల్‌ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని వారు వాదిస్తున్నారు.

అయితే ఇలా వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది మంది విదేశీ విద్యార్థులకు నిర్బంధం, డిపోర్టేషన్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్‌, స్టాన్ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌, ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ వంటి పెద్ద పెద్ద యూనివర్శిటీలతో పాటు.. చిన్న యూనివర్శిటీల స్టూడెంట్స్ కూడా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. మార్చి చివరి వారం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 160 కాలేజీల నుంచి వివరాలను సేకరించగా.. కనీసం 1024 మంది విద్యార్థుల వీసాలు రద్దయినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో D.H.S అంటే.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ చర్యలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్న విద్యార్థులు.. తమ వీసా రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం వద్ద ఎటువంటి సమర్థనీయ అంశాలు లేవని వాదిస్తున్నారు.

మరోవైపు వీసా రద్దుకు చాలా కారణాలు చూపెడుతున్నా.. విద్యార్ధులు చిన్నచిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయని యూనివర్శిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరికొన్ని కేసుల్లో అయితే మాత్రం విద్యార్థులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపైన ఎవరికీ క్లారిటీ ఉండటం లేదని చెబుతున్నాయి. ఈ వీసాలను రద్దు చేస్తున్న సందర్భం, విధానాన్ని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే ఇలా విద్యార్థి వీసాలను రద్దు చేసే విధానాన్ని డీహెచ్‌ఎస్‌ అవలంబిస్తుందనే ప్రశ్న తలెత్తుతోందని కొన్ని‌ యూనివర్సిటీల తరఫున వాదిస్తున్న లాయర్లు తమ పిటిషన్‌లో పేర్కొంటున్నారు. వివిధ యూనివర్శిటీలలోని తమ వీసా రద్దుపై విద్యార్థులు వేసిన దావాలోనూ ఇటువంటి అంశాలనే ప్రస్తావించారు. అయితే వీటిపై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది.

ఒకవేళ అమెరికాలో విదేశీ విద్యార్థి వీసా రద్దైతే..వారిని ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది. అందుకే అరెస్టుకు భయపడిన కొంతమంది స్టూడెంట్స్..తమ చదువులు పూర్తి చేయకుండానే అమెరికాను విడిచి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వీసా రద్దు, అరెస్టు చేయడం వంటి చర్యల వల్ల.. అమెరికా చదువుల పట్ల ఇతర దేశ విద్యార్ధులు నిరుత్సాహానికి గురిచేస్తాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏయే అంశాల ఆధారంగా వీసాలను రద్దు చేస్తున్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో.. విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు.

మరోవైపు, విదేశీ విద్యార్థుల్లో భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తున్న కొన్ని యూనివర్శిటీలు.. వీసాల రద్దుకు సంబంధించి ఫెడరల్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతున్నాయి. మరికొన్ని యూనివర్శిటీలు మాత్రం విద్యార్థులు అమెరికాలో ప్రయాణించినా కూడా తమ వెంట పాస్‌పోర్టులు, ఇమిగ్రేషన్‌ దస్త్రాలను ఉంచుకోవాలని చెబుతున్నాయి. ఇప్పట్లో స్వదేశ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాయి.